కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ | - | Sakshi
Sakshi News home page

కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ

Jan 7 2026 7:32 AM | Updated on Jan 7 2026 7:32 AM

కోడిగ

కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ

ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ ఆదేశం

అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన కోడిగుడ్ల కుంభకోణం నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సోమవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ నిర్వహించిన పరిశీలనలో అక్రమాలు వెలుగు చూశాయి. ముద్ద అన్నం.. తక్కువ మోతాదులో ఆకుకూరలు, కూరగాయలు వినియోగించిన చేసిన కూరలు, పరిమాణం తగ్గిపోయిన కోడిగుడ్లు, నిర్దేశించిన రోజుల్లో కోత విధిస్తూ సరఫరా చేసిన వైనం, చిక్కీల పరిమాణం కుదించడం వంటివి బయటపడ్డాయి. ఈ అంశంపై ‘డొక్క’లు ఎండబెట్టి.. నిధులు కొల్లగొట్టి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌శర్మ స్పందించారు. కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ కోసం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లికార్జునుడు, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ రామకృష్ణారెడ్డి సహా మరో అధికారిణితో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు.

శ్రీనందన ఎంటర్‌ప్రైజస్‌ దోపిడీ పర్వం

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,249 ప్రాథమిక, 63 ప్రాథమికోన్నత, 363 ఉన్నత పాఠశాలలతో పాటు 1,675 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు శ్రీనందన ఎంటర్‌ ప్రైజస్‌ అనే సంస్థ కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తోంది. మొత్తం 3,55,418 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ సంస్థ ఐసీడీఎస్‌లోని ఓ సీనియర్‌ ఉద్యోగికి చెందినదిగా తెలుస్తోంది. తను ప్రభుత్వోద్యోగి కావడంతో కుమారుడి పేరుతో ఈ సంస్థ నడుపుతున్నట్లు సమాచారం. ఈ సంస్థే జిల్లాలోని అన్ని అంగన్‌వాడీలకు కూడా కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తోందని తెలిసింది. సదరు ఉద్యోగి ఈ ఒక్క జిల్లానే కాకుండా వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు పేర్లతో, బినామీల పేర్లతో కాంట్రాక్ట్‌లు దక్కించుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్కో ట్రిప్పులో ఒక్కో రంగు చొప్పున గుడ్ల మీద వేయాలి. అటువంటి పరిస్థితి లేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కో గుడ్డుకు పావలా కమీషన్‌

ఒక గుడ్డు కనీసం 50 గ్రాముల పరిమాణంలో ఉండాలి. అయితే ఈ సంస్థ 25 నుంచి 30 గ్రాములు ఉన్న కోడిగుడ్లు మాత్రమే సరఫరా చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. విద్యాశాఖాధికారులకు గుడ్డుకు పావలా చొప్పున కమీషన్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో హెడ్మాస్టర్లు అన్నీ చూసుకోవాలి. సైజు తక్కువ ఉన్న కోడిగుడ్లు ఇస్తే వెనక్కు పంపాలి. అయితే అలా జరగడం లేదు. నెలకు ఒకట్రెండుసార్లు మాత్రమే స్టాకు ఇచ్చినా నిలదీయడం లేదు. ఇక మధ్యాహ్న భోజన పథకం తనిఖీ బాధ్యత ఎంఈఓ–2 చూడాలి. వారూ నోరెత్తరు. ఎందుకుంటే ఏదైనా ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్‌ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు చేయిస్తున్నట్లు హెడ్మాస్టర్లు, ఎంఈఓల ద్వారా తెలిసింది. డీఈఓ కార్యాలయ అధికారులైతే హెడ్మాస్టర్లు, ఎంఈఓలపై సాకు నెట్టేస్తూ పబ్బం గడిపేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలే అవుతున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చిన రోజు హడావుడి చేస్తారు. అంతటితో మరచిపోతున్నారు. తాజాగా ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ నియమించారు. ఈ కమిటీ అయినా నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంగా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాలు నిగ్గుతేల్చి అక్రమార్కులను శిక్షిస్తారా లేక రక్షిస్తారా అనే సందేహాలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లాలో ఇదీ పరిస్థితి..

శ్రీసత్యసాయి జిల్లాలోనూ మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్లకు భోజ్యంగా మారింది. ఇక్కడ 32 మండలాలు ఉండగా, హనుమాన్‌ ట్రేడర్స్‌కు 22 మండలాలు, శ్రీలక్ష్మీవెంకటేశ్వర ట్రేడర్స్‌కు 11 మండలాల కోడిగుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఇక అన్ని మండలాలకూ చిక్కీల సరఫరా హనుమాన్‌ ట్రేడర్స్‌కే అప్పగించినట్లు సమాచారం. ఏ ఒక్క సంస్థ గానీ సక్రమంగా గుడ్లు, చిక్కీలు సరఫరా చేసిన దాఖలాల్లేవు. పట్టుమని ఒక నెల కూడా గుడ్లు, చిక్కీలు సరఫరా చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక విద్యా శాఖ అధికారులకు భారీగా కమీషన్లు అందడమేనని బలమైన ఆరోపణలు ఉన్నాయి.

కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ 1
1/1

కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement