ప్రజాప్రతినిధుల వైఫల్యంతోనే నీటి కష్టాలు
అనంతపురం సెంట్రల్: రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే శింగనమల నియోజకవర్గంలో అన్నదాతలకు నీటి కష్టాలు ఉత్పన్నమవుతున్నాయని, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ మండిపడ్డారు. నియోజకవర్గ రైతులతో కలిసి బుధవారం అనంతపురంలోని హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హెచ్చెల్సీ కోటా పూర్తవుతున్నప్పటికీ నియోజకవర్గంలోని సుబ్బరాయసాగర్, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి తదితర చెరువులకు చుక్కనీరు చేరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరనున్న చెరువులతో పాటు గార్లదిన్నె మండల పరిధిలోని చెరువులకు కూడా ఇంత వరకూ నీటిని విడుదల చేయలేదన్నారు. ఈ విషయంపై అనేకసార్లు కలిసినా అధికారులు బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుండటం బాధాకరమన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు రైతుల కష్టాలు ఏమాత్రమూ పట్టడం లేదని, నిండని చెరువులకు టెంకాయ కొట్టడం మాత్రమే వారికి తెలుసునని విమర్శించారు.
రైతుల పక్షాన పోరాడుతాం
‘సుబ్బరాయసాగర్‌లో చెట్లు నరికివేస్తున్నారు. పలు చోట్ల అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అందుకోసమే చెరువులకు నీరివ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదు. గడువులోగా నీరివ్వకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తాం’ అని శైలజానాథ్ స్పష్టం చేశారు. నీరివ్వాలని అడిగితే రాజకీయం చేస్తున్నారంటూ కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కోసం రాజకీయం చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. పుట్లూరు మండలంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఒక్కసారి వెళ్లి చూడాలని అధికారులకు సూచించారు. చెరువులను నింపకపోతే వేసవిలో బోర్లు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే శింగనమల చెరువుకు జీఓ ప్రకారం 1 టీఎంసీ నిరు విడుదల చేసి నింపాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 16 వరకూ పంటలకు నీరిస్తామని, ఆ తర్వాత చెరువులకు విడుదల చేస్తామని హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ నీలం భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, గోకుల్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, మండల కన్వీనర్లు యల్లారెడ్డి, పూలప్రసాద్, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు జె.అనిల్‌కుమార్‌రెడ్డి, ఖాదర్‌వలి, మహేశ్వరరెడ్డి, శివశంకర్, శ్రీనివాసులునాయక్, నాగేశ్వరరెడ్డి, లలితా కళ్యాణి, సర్పంచ్ పార్వతి, హుస్సేన్‌పీరా, నారాయణరెడ్డి, రమణయాదవ్, బయపరెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నీరున్నా చెరువులను నింపకపోతే ఎలా..?
అధికారులను నిలదీసిన మాజీ మంత్రి శైలజానాథ్
హెచ్చెల్సీ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఆందోళన


