పొలంలో కొండచిలువ
పుట్లూరు: గరుగుచింతపల్లికి చెందిన వెంకటశివుడు అనే రైతు పొలంలో బుధవారం కొండ చిలువ కనిపించింది. ఇది దాదాపు 9 అడుగుల పొడవు ఉంది. రైతు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.బి.జగన్నాథం, బీట్ ఆఫీసర్ ఎ.ఎస్.గయాజ్ ఆధ్వర్యంలో స్నేక్ క్యాచర్లు ఎస్.సురేష్, జే.సురేష్‌లు పొలంలోని కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.
డీవీఈఓగా గురవయ్యశెట్టి
అనంతపురం సిటీ: జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి(డీవీఈఓ)గా ఎస్‌వీఎస్ గురవయ్య శెట్టి నియమితులయ్యారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఆయన్ను పదోన్నతిపై అనంతపురం డీవీఈఓగా నియమించారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ డీవీఈఓగా పని చేసిన వెంకటరమణ నాయక్ ఆర్‌ఐఓగా కొనసాగనున్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో చోటు
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు కల్పించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కుమ్మర వంశీ యువజన విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా, రాయదుర్గానికి చెందిన గోనేహాళ్ వంశీ సోషల్ మీడియా విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా, హెచ్.మల్లికార్జున ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా, డి.చంద్రశేఖర్ రెడ్డి రాయదుర్గం మునిసిపల్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
ఇంటి పన్ను చెల్లించిన వారికి మాత్రమే అనుమతి
శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వద్దకు వెళ్లాలన్నా నిబంధనలు అమలు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో అతికించిన నోటీసు. పనుల కోసం వచ్చే ప్రజలు 2025–26 సంవత్సరంలో ఇంటి పన్ను చెల్లించిన రశీదు జిరాక్స్ పత్రాన్ని తీసుకువస్తేనే లోనికి అనుమతి ఇస్తామని ఇన్‌చార్జ్ ఎంపీడీఓ భాస్కర్ కార్యాలయంలో నోటీసు అతికించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదెక్కడి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు.
పొలంలో కొండచిలువ


