బండ బూతులు.. భౌతికదాడులు
● పారిశుధ్య కార్మికురాలిపై శానిటేషన్ ఏజెన్సీ దౌర్జన్యం
అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో ఓ పారిశుధ్య కార్మికురాలిపై శానిటేషన్ ఏజెన్సీ ప్రతినిధులు కర్కశంగా వ్యవహరించారు. కార్మికురాలిని బండబూతులు తిడుతూ.. భౌతికదాడులకు పాల్పడడం ద్వారా భయానక వాతావరణం సృష్టించారు. ఆస్పత్రి అధికారులు, పారిశుధ్య సిబ్బంది తెలిపిన మేరకు... విధుల నుంచి బలవంతంగా తొలగిస్తున్నారంటూ పద్మావతి అనే పారిశుధ్య కార్మికురాలు ఇటీవల ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నం చేశారు. కోలుకున్న అనంతరం తిరిగి విధులకు హాజరవుతున్నారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రి ఆవరణలో పనిచేస్తున్న పద్మావతి వద్దకు శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్ సాయి, హరి వచ్చి ‘మేము నిన్ను చచ్చిపోమన్నామా?’ అంటూ గద్దించారు. ఆ పక్కనే విధుల్లో ఉన్న మరో పారిశుధ్య కార్మికురాలు నల్లమ్మను చూస్తూ ‘మీదంతా ఎక్కువైంద’ని శానిటేషన్ సూపర్‌వైజర్ యశ్వంత్ నోరుపారేసుకున్నాడు. మాటామాటా పెరిగడంతో రెచ్చిపోయి నల్లమ్మపై భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న తోటి పారిశుధ్య కార్మికులు అక్కడకు చేరుకుని నల్లమ్మను క్యాజువాలిటీలో అడ్మిట్ చేశారు. బాధితురాలిని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పరామర్శించారు. చంద్రబాబు మిత్రుడికి చెందిన పద్మావతి ఏజెన్సీ వారు కార్మికులపై ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.


