ప్రజల ప్రాణాలతో చెలగాటం
కళ్యాణదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) కాలువ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాలువలోకి దూసుకుపోయి ప్రమాదాలకు గురికాక తప్పదు. నిబంధనలు పట్టించుకోకుండా ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్ట్ సంస్థపై ప్రజలు మండిపడుతున్నారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లేందుకు కాలువ పనులు జరుగుతున్నాయి. పనులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్ కనస్ట్రక్షన్స్ కంపెనీ చేస్తోంది. అయితే ఒంటిమిద్ది వద్ద అనంతపురం– కళ్యాణదుర్గం ప్రధాన రహదారిని తవ్వి బ్రిడ్జి నిర్మిస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా.. అక్కడి నుంచి వాహనాలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ (రోడ్డు డైవర్షన్) పనులు చేశారు. ఇది వాహనదారులకు అత్యంత ప్రమాదకరంగా మారింది. కాలువ తవ్విన చోట వాహనదారులకు కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీనికి తోడు కాలువ తవ్విన చోట డ్రమ్ములు, కోన్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటి స్థానంలో కర్రలు అమర్చడం కొసమెరుపు. రోడ్డు డైవర్షన్ చేయాలంటే సదరు కాంట్రాక్టరు ముందుగా దారి మళ్లింపు ఎటువైపు ఉందో స్పష్టంగా చూపించే బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా విస్మరించారు. వాహనాలను నియంత్రించడానికి రెడ్, ఎల్లో, గ్రీన్ రంగు లైట్లు లేదా ఫ్లాషింగ్ లైట్లు ఏర్పాటు చేయలేదు. రాత్రి పూట రహదారి స్పష్టంగా కనిపించడానికి అదనపు లైట్లు ఏర్పాటు చేయలేదు. వాహనదారులను అప్రమత్తం చేసే హెచ్చరిక గుర్తులనూ ఏర్పాటు చేయలేదు.
అధికారుల నిర్లక్ష్యం
గతంలో అనంతపురం నుంచి మొలకాల్మూరు వరకు జరిగిన ఎన్‌హెచ్44 డీ పనులు చేపట్టే సమయంలోనే బీటీపీ పనులను కూడా ఎస్‌ఆర్‌సీ కంపెనీ దక్కించుకుంది. అయితే రోడ్డు నిర్మాణం చేసే సమయంలోనే ఒంటిమిద్ది వద్ద బ్రిడ్జి నిర్మించాలని ఉంది. అయితే అప్పట్లో నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒంటిమిద్ది వద్ద ప్రమాదకరంగా
రోడ్డు డైవర్షన్ దృశ్యం
రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని వైనం
బీటీపీ కాలువ పనుల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన
సూచికలు, హెచ్చరికలు లేకుండా రోడ్డు డైవర్షన్
నిబంధనలు పాటించని ఎస్‌ఆర్‌సీ కంపెనీ
ప్రజల ప్రాణాలతో చెలగాటం


