చిరుత కలకలం
తాడిపత్రి రూరల్: మండలంలోని తలారిచెరువు– ఊరుచింతల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆ ప్రాంతంలోని అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది బుధవారం తెల్లవారుజామున చిరుతను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరుత విషయం తెలియడంతో ఊరుచింతల, తలారిచెరువు, ఆలూరు, వెలమకూరువాసుల్లో భయాందోళన నెలకొంది. రైతులు, పశువుల కాపర్లు హడలెత్తుతున్నారు. ఊరుచింతల–తలారి చెరువు ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు సోలార్, గాలి మరల ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మరికొన్ని పరిశ్రమలకు చెందిన పనులు జరుగుతున్నాయి. వీటిలో వందలాది మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రాకపోకలు కొనసాగిస్తుంటారు. రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన భూదేవి, శ్రీదేవి సమేత రంగనాథస్వామి ఆలయానికి ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఆలయం చుట్టూ సెలయేర్లు ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. తలారిచెరువు సమీపంలో ఉన్న పురాతన హజీవలి దర్గాలో హిందూ, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. రాత్రి సమయాల్లో దర్గాలో బస చేస్తుంటారు. చిరుత సంచారం అందరిలో ఒక్కసారిగా గుబులు రేపింది. చిరుత ఆచూకీ కోసం ముచ్చుకోట ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ జగన్నాథం, సిబ్బందితో కలిసి గాలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, మేకలు, పశువులను మేపునకు తీసుకెళ్లరాదని హెచ్చరించారు. తాడిపత్రి అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది సైతం ప్రజలను అప్రమత్తం చేశారు. గుత్తి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మధుబాబు మాట్లాడుతూ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
60 ఏళ్ల తరువాత..
ఊరుచింతల–తలారిచెరువు పరిసర ప్రాంతాల్లో 60 ఏళ్ల తరువాత చిరుత ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో పెద్దసంఖ్యలో చిరుతల సంచారం ఉన్నా కాలక్రమేణా అంతరించిపోయాయని తెలిపారు. కాగా, ఊరుచింతల కొండ ప్రాంతం కావడంతో పాటు జింకల సంచారం ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలోనే చిరుత ఆహారం కోసం దారి తప్పి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.


