జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
అనంతపురం:బాంబు బెదిరింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కోర్టులో గురువారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సుమారు 50 జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపుల ఈ–మెయిల్స్ అందాయి. ‘మహమ్మద్ అస్లాం విక్రమ్ తమిళ లిబరేషన్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఓ)’ పేరిట ఈ–మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. అనంతపురం జిల్లా కోర్టు, రికార్డుల రూంలో తనిఖీలు నిర్వహించారు. అవి ఉత్తుత్తి బెదిరింపులని తేలిందని అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. కోర్టు ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, బాంబు బెదిరింపుల నేపథ్యంలో గురువారం జిల్లా కోర్టులో కార్యకలాపాలన్నీ బంద్ చేశారు. కేసుల విచారణకు ఆటంకం ఏర్పడింది.
పడిపోయిన టమాట ధర
ఆత్మకూరు: సంక్రాంతి పండుగ సమయంలో టమాట రైతులకు నిరాశే మిగిలింది. మూడు రోజుల క్రితం మార్కెట్‌లో రూ.600 వరకు పలికిన 15 కిలోల బాక్సు ధర గురువారం ఉన్నట్లుండి ఏకంగా రూ.50–100కు పడిపోయింది. అది కూడా మెదటి, రెండు కోతలకు సంబంధించిన టమాటలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. కొంచెం చిన్నగా, మరీ ఎర్రగా ఉన్న టమాటలను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో రైతులు టమాటలను రోడ్ల పక్కన పడేస్తున్నారు. రెండు రోజుల్లోనే ఆకాశం నుంచి నేలకు పడినట్లుగా ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అక్రమ మైనింగ్ ఆటకట్టు
పెద్దవడుగూరు: మండలంలోని కొండుపల్లి గనిలో అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్న అంశంపై గత ఏడాది నవంబర్ 12 నుంచి విచారణ చేపట్టిన అధికారులు గురువారం ఎట్టకేలకు మైనింగ్ గనిని సీజ్ చేశారు. ఏడేళ్లుగా గాజుల రమణ అనే వ్యక్తి అనుమతులు తీసుకోకుండా సర్వే నంబర్ 319/ఏ1, 319/బీ1లోని 14.81 ఎకరాల్లో మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని కొండుపల్లికి చెందిన రమేష్‌బాబు 2025 నవంబర్ 3న పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వచ్చింది. గని ప్రాంతంలో నిల్వ ఉన్న బలపం రాయి, డోలమైట్‌ను పరిశీలించి వెలకట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. వారి ఆదేశాల మేరకు గనిని సీజ్ చేసి, యంత్రాలు, ఖనిజాన్ని స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. కార్యక్రమంలో మైనింగ్ అధికారి వరప్రసాదరెడ్డి, వీఆర్వోలు ఉన్నారు.
జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు


