ఘుమఘుమ.. కళకళ
కుందుర్పి: బెస్తరపల్లి సవారమ్మ జాతర సంబరం అంబరమంటింది. 96 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతర కావడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తొలిరోజు మంగళవారం జ్యోతుల మహోత్సవం నిర్వహించారు. రెండో రోజు బుధవారం జంతుబలి ఇచ్చారు. గ్రామంలో దాదాపు 1200 ఇళ్లు ఉన్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లి ఉంటున్న వారు, బంధుమిత్రులు తరలిరావడంతో గ్రామం జన జాతరతో కళకళలాడింది. ప్రతి ఇంటా షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటా రెండు నుంచి మూడు పొట్టేళ్లతో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. ఇందు కోసమే రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చర్చించుకుంటున్నారు. ఏ ఇంట చూసినా మసాలా ఘుమఘుమలతో వంటకాలు నోరూరించాయి. ఇక సవారమ్మ ఆలయం వద్ద సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే బెస్తరపల్లి సవారమ్మ జాతర కనీవినీ ఎరుగని రీతిలో జరగడం చర్చనీయాంశమైంది. జాతరకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్యతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు హాజరై సవారమ్మ తల్లిని దర్శించుకున్నారు. విందు భోజనాలు ఆరగించి సంతోషంగా గడిపారు. జాతర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
96 ఏళ్ల తర్వాత బెస్తరపల్లిలో సవారమ్మ జాతర
నాలుగు రాష్ట్రాల నుంచి బంధుమిత్రుల రాక
ఘుమఘుమ.. కళకళ


