సెంట్రల్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి! | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి!

Jan 7 2026 7:32 AM | Updated on Jan 7 2026 7:32 AM

సెంట్

సెంట్రల్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి!

రిపబ్లిక్‌ డే అనంతరం స్నాతకోత్సవ తేదీ ఖరారు!

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో జరిగే స్నాతకోత్సవానికి విజిటర్‌ హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ చట్టంలో భాగంగా 2018లో సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటైంది. జేఎన్‌టీయూ అనంతపురం ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టు నుంచి శాశ్వత క్యాంపస్‌ అయిన జంతలూరులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌డీ కోర్సులు సైతం నిర్వహిస్తున్నారు. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా స్నాతకోత్సవం నిర్వహించలేదు. దీంతో 2018–20 పీజీ, 2018–21 డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. మొత్తం 845 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు.

పాఠశాలలకు

నిధులు విడుదల

అనంతపురం సిటీ: విద్యార్థుల్లో వృత్తి స్పృహ, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున నిధులు మంజూరు చేసిందని సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త టి.శైలజ, జీసీడీఓ కవిత మంగళవారం తెలిపారు. ఈ లెక్కన జిల్లాలోని 49 పాఠశాలలకు రూ.7.35 లక్షలు విడుదలైనట్లు వెల్లడించారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020 ప్రకారం వృత్తి విద్యా కార్యక్రమాల ప్రాముఖ్యత దృష్ట్యా ఆరో తరగతి నుంచే నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష స్కూళ్లలో 6 నుంచి 8 తరగతులకు వృత్తి విద్య కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు.

కందుల కొనుగోళ్లు ప్రారంభం

అనంతపురం అగ్రికల్చర్‌: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం కందుల కొనుగోళ్లు మంగళవారం నుంచి ప్రారంభించినట్లు మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పెన్నేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు గుంతకల్లులో మాత్రమే కేంద్రం ప్రారంభం కాగా... రెండు మూడు రోజుల్లో అన్ని మండలాల్లో కొనుగోళ్లు మొదలవుతాయన్నారు. ఇప్పటి వరకు 9 వేల మంది వరకు రైతులు ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌లో సాగు చేసి...ఈ –క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కందులు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ సీజన్‌లో 24,338 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

వైభవంగా తిరుప్పావై

సేవా గోష్టి

తాడిపత్రి రూరల్‌ : పట్టణ, రూరల్‌ ప్రాంతంలో మంగళవారం తిరుప్పావై సేవా గోష్టి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని శ్రీభూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి దేవాలయ అర్చకులు శ్రీనివాస ఆయ్యంగార్‌, చింతలరాయన్‌ అయ్యంగార్‌ ఆధ్వర్యంలో తిరుప్పావై సేవా గోష్టి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీగోదాదేవి, శ్రీరంగనాథస్వాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చిన అర్చకులు విశేష పూజలు చేశారు. 30 రోజుల పాటు శ్రీగోదాదేవి ఆలపించిన పాశురాలను అర్చకులు భక్తులకు వివరించారు.

సెంట్రల్‌ వర్సిటీ  స్నాతకోత్సవానికి రాష్ట్రపతి! 1
1/2

సెంట్రల్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి!

సెంట్రల్‌ వర్సిటీ  స్నాతకోత్సవానికి రాష్ట్రపతి! 2
2/2

సెంట్రల్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement