అలసత్వంపై కొరడా
● 27 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
అనంతపురం ఎడ్యుకేషన్: విధుల పట్ల అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు కొరడా ఝుళిపించారు. ఏకంగా 27 మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్ తదితర అంశాలపై మంగళవారం సమీక్షించారు. పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి నెలా నిర్వహించే ఐవీఆర్‌ఎస్ కాలింగ్‌లో జనవరి నివేదికలో జిల్లాలో 27 పంచాయతీలు ‘0’ శాతం పురోగతి సాధించినట్లు గుర్తించారు. ఇంటి నుంచి చెత్త సేకరణ చేయని వైనంపై బెణకల్లు, బాలాపురం, తిరుమలాపురం, డి.హీరేహాళ్, ఆర్.అనంతపురం, వెంకటరెడ్డిపల్లి, వేల్పుమడుగు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారానికి కనీసం రెండుసార్లు కూడా చెత్తసేకరణ చేయని వైనంపై పి.యాలేరు, నక్కలపల్లి, రాయలప్పదొడ్డి, దురదకుంట, బెణకల్లు, గులిమికొండ్ల కొట్టాల, హులికల్, గడ్డంనాగేపల్లి, శిరిపురం, చెర్లోపల్లి, గుండాల, బీఎన్ హళ్లి, రేకులకుంట, కొంతానపల్లి, బేలోడు, వ్యాసాపురం, నెరిమెట్ల, కమలపాడు, డొనేకల్లు, బొప్పేపల్లి పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. హౌస్ ట్యాక్స్ డిమాండ్ రూ.లక్ష లోపు ఉన్న పంచాయతీలు ఈ నెల 10లోపు పూర్తిస్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, లేదంటే వచ్చే నెలలో వచ్చే ఐవీఆర్‌ఎస్ నివేదికలో తక్కువ ప్రోగ్రెస్ వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై తరచూ పర్యవేక్షించాలని డీడీఓలు, డీఎల్‌పీఓలు, డెప్యూటీ ఎంపీడీఓలకు డీపీఓ సూచించారు.
బెణకల్లు సెక్రటరీ సస్పెన్షన్‌కు సిఫార్సు
విధుల్లో మరీ నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించిన కణేకల్లు మండలం బెణకల్లు పంచాయతీ కార్యదర్శి తిరుమలరెడ్డిని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో డీపీఓ నాగరాజునాయుడు జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేశారు.


