జిల్లా అంతటా మంగళవారం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి.
పోలీసుల ఓవరాక్షన్
● గ్రామ దేవరకు హాజరైన కేతిరెడ్డి పెద్దారెడ్డి
● ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ సీఐ హుకుం
● నామనాంకపల్లిలో ఉద్రిక్తత
తాడిపత్రిటౌన్: గ్రామ దేవరకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్ల పోలీసులు మరోమారు రెచ్చిపోయారు. శాంతిభద్రతల పేరుతో ఆయన్ను గ్రామం నుంచి వెళ్లిపోవాలంటే హుకుం జారీ చేశారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లిలో మంగళవారం గ్రామ జాతర (దేవర)కు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు. తొలుత పెద్దమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు గ్రామస్తులు తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలో వారి ఇళ్ల వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఓ ఇంటి వద్ద కాఫీ తాగుతున్న సమయంలో సీఐ రామసుబ్బయ్య, ఎస్‌లు గౌస్, చంద్రశేఖర్‌రెడ్డి వచ్చి ‘శాంతిభద్రతలకు ఇబ్బంది అవుతుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగక పెద్దారెడ్డి చేయి పట్టుకుని బలవంతంగా ఊరునుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో సీఐ–పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కల్పించుకుని.. గ్రామదేవరకు రావడం కూడా తప్పేనా.. ఎందుకిలా ప్రతిసారీ రాద్ధాంతం చేస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు.
15 వరకు ఆయకట్టుకు నీరు
అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ సౌత్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు ఈ నెల 15 వరకు నీరివ్వాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం పలు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సభ్యులతో హెచ్చెల్సీ అధికారులు సమావేశం నిర్వహించారు. 15వ తేదీ వరకు డిస్ట్రిబ్యూటరీలకు నీరిచ్చి, తర్వాత పూర్తిస్థాయిలో బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత పుట్లూరు మండల పరిధిలో సుబ్బరాయసాగర్, దిగువన చెరువులకు నీటిని తీసుకుపోవాలని భావిస్తున్నారు.


