జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం
సరుకులివ్వకపోతే
భోజనమెలా పెట్టాలి?
● అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన
ఆత్మకూరు: అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్ సరుకులు ఇవ్వకపోతే పిల్లలకు భోజనం ఎలా వండి పెట్టాలని అంగన్‌వాడీ కార్యకర్తలు రెవెన్యూ అధికారులను నిలదీశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సీఎస్‌డీటీ లక్ష్మీదేవిని కలిసి సమస్యను ఏకరువు పెట్టారు. పిల్లలను పస్తులుంచలేక ఇంటి నుంచి బియ్యం తెచ్చి వండి పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 47 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 15 అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా కాలేదన్నారు. ఆర్‌ఓలో వచ్చినా డీలర్లు స్టాక్ ఇవ్వడం లేదన్నారు. నాలుగు నెలలుగా బియ్యం, కందిపప్పు, వంట నూనె సరిగా అందడం లేదని, సీడీపీఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. డీలర్లు మేం ఇచ్చినప్పుడు తీసుకోండంటూ హూంకరిస్తున్నారని వాపోయారు. ఐదో తేదీలోపు ఇవ్వాల్సిన సరుకులను 15వ తేదీ అయినా పంపిణీ చేయరని తెలిపారు. ప్రీస్కూల్ పిల్లలకు ఏం వండి పెట్టాలి.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సరుకులు ఎలా ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు. దీంతో సీఎస్‌డీటీ స్పందిస్తూ డీలర్లకు ఫోన్ చేసి రేషన్ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
పరారీలో కీచక టీచర్
తాడిపత్రిటౌన్: పెద్దపప్పూరు మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదివారం సాయంత్రం ట్యూషన్ పేరిట ఇంటికి పిలిపించుకుని ఎనిమిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆదే సమయంలో ఇంటికి వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులు గమనించి ఉపాధ్యాయుడిని గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్న ఉపాధ్యాయుడిని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి దేహశుద్ధి చేశారు. దీంతో పరారైన ఉపాధ్యాయుడు సోమవారం పాఠశాలకు గైర్హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు సెలవు కావాలని హెచ్‌ఎంకు ఫోన్‌లో కోరి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయమై ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డిని ప్రశ్నించగా తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు. ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించగా విద్యార్థి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.


