వామ్మో.. ఇన్ని సమస్యలా...
తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో తమ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వారు వీరు. అధికారులు ఊహించని రీతిలో అర్జీదారులు రావడంతో మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ శివ్‌నారాయణశర్మ, ఇతర జిల్లాధికారులు అర్జీలు స్వీకరించారు. దాదాపు 380 అర్జీలు వచ్చినట్లు తెలిసింది. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలున్నట్లు సమాచారం. ఇక.. అర్జీదారులకు అనుగుణంగా మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం పైఅంతస్తులో కార్యక్రమం నిర్వహించడంతో దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు.
వినతుల్లో కొన్ని..
544డీ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన తమకు పరిహారం అందలేదని తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువు గ్రామంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కొందరు కబ్జా చేశారని, భూములను కాపాడాలని ఆలయ అర్చకులు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రిలో ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేయాలని విలేకరులు ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే విలేకరులకు ఇంటి స్థలాలివ్వాలని కోరారు.
వామ్మో.. ఇన్ని సమస్యలా...


