వణికిస్తున్న చలి
● అమడగూరులో 9.2, శెట్టూరులో 10.9 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్: చలి పంజాతో ఉమ్మడి జిల్లా వణుకుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. ఈనెల మొదటి నుంచి చలిగింతలు మొదలై క్రమంగా తారస్థాయికి చేరుకుంది. గురువారం అమడగూరులో 9.2 డిగ్రీలు, శెట్టూరులో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడా సింగిల్ డిజిట్‌కు పడిపోవడం విశేషం. మడకశిర, సోమందేపల్లి, తనకల్లు, శెట్టూరు, కుందుర్పి, విడపనకల్లు తదితర మండలాల్లో ఇటీవల 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 నుంచి 32 డిగ్రీల మధ్య నమదవుతుండగా రాత్రిళ్లు 15 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. దీంతో సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత కనిపిస్తోంది. వేకువజామున పొగమంచు అధికంగానే ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చలి బాగా పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు.
ఓం నమో నారసింహా....
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురువారం ఓం నమో నరసింహ...నామస్మరణతో మార్మోగింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు, కడప, చిత్తూరు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎన్. సతీష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో ఆయన మాట్లాడారు. భక్తులకు క్యూలలో ఎలాంటి అసౌర్యం కలగకుండా చూడాలన్నారు. త్వరితగతిన స్వామి దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన కదిరి బైపాస్ వద్ద ఈ నెల 27,28 తేదీల్లో జరగనున్న ఇస్తెమా ఏర్పాట్లు కూడా పరిశీలించారు.
వణికిస్తున్న చలి


