వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి
హిందూపురం: పట్టణంలోని శ్రీనివాస మందిరం రోడ్డు ప్రాంతంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి ఘనంగా జరిగింది. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి ఆభరణాలతో విశేషంగా అలంకరణ చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న నాగుల విగ్రహాలకు మహిళలు పాలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. షష్టి సందర్భంగా మూలవిరాట్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం రైల్వేరోడ్డులోని రథం వద్ద వేదపండితులు హోమాలు చేసిన అనంతరం ఆలయం నుంచి శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో మేళతాళాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. రథం వద్దకు తీసుకెళ్లి కొలువుదీర్చారు. మహామంగళ హారతి అనంతర ప్రారంభమైన రథోత్సవంలో భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథం ముందు ఓ కళాకారుడు జంగమ దేవర వీరభద్ర వేషధారణలో చేసిన నృత్యాలు, వినాస్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మంజునాథశర్మ, చంద్రమౌళిలు, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి


