కేశవా.. ఇటు చూడవా!
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులు పూర్తి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. ‘కేశవా.. ఒక్కసారి ఇటు చూడవా!’ అని వేడుకుంటున్నారు.
కాజ్ వే కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మట్టితో పూడ్చిన దృశ్యం
కోతకు గురి కావడంతో పెద్ద పెద్ద రాళ్లు వేసిన దృశ్యం
విడపనకల్లు: మండలంలోని పాల్తూరు నుంచి దర్గాహొన్నూరుకు వెళ్లే రహదారిలో పెద్ద వంక కాజ్‌వే పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. కాజ్‌వే మొత్తం అక్కడక్కడ నెర్రెలు చీలి ముక్కలు ముక్కలుగా రాలిపోతోంది. గతంలో కురిసిన వర్షానికి కాజ్‌వేలో కొంత ప్రాంతం కొట్టుకు పోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామస్తులు ఏకమై మట్టి, రాళ్లతో పూడ్చి రాకపోకలు సాగిస్తున్నారు.
వాహనాలన్నీ అటుగానే
ఉరవకొండ నుంచి ఉండబండ, పాల్తూరు మీదుగా బొమ్మనహాళ్ మండలంలోని కలవలితిప్ప, గోవిందవాడ, దర్గా హొన్నూరు, బొల్లనగుడ్డం వరకు ఆర్టీసీ సర్వీసులతో పాటు రోజూ వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, కార్లు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. పాల్తూరు దాటిన తర్వాత వచ్చే పెద్ద వంక కాజ్ వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాజ్ వే మధ్యలో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో కాజ్ వే దుస్థితిని గమనించిన ఆర్టీసీ అధికారులు ఈ మార్గంలో ఆర్టీసీ సర్వీసులను ఏకంగా రద్దు చేసేశారు. ఎప్పుడు కూలుతుందో చెప్పలేని కాజ్ వే మీదుగా ప్రయాణం సాగిస్తూ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టలేమని ఆ సమయంలో ఉరవకొండ డిపో అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి నూతన కాజ్‌వే నిర్మాణానికి చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
శిథిలావస్థలో పాల్తూరు పెద్ద వంక కాజ్‌వే
గత వర్షాలకు కొట్టుకుపోయిన వైనం
మట్టి, రాళ్లతో పూడ్చి రాకపోకలు సాగిస్తున్న గ్రామీణులు
ఎప్పుడు కొట్టుకుపోతుందో తెలియని అయోమయం
ఇప్పటికై నా మంత్రి కేశవ్ స్పందించాలంటున్న గ్రామీణ ప్రజలు
కేశవా.. ఇటు చూడవా!


