‘పట్టు’ కోల్పోతున్న అనంత
అనంతపురం అగ్రికల్చర్: మల్బరీ సాగులో ఒక వెలుగు వెలిగిన అనంతపురం జిల్లా ఇప్పుడు డీలా పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీలు ఇవ్వకపోవడంతో మల్బరీ రైతులు పట్టు కోల్పోతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అరకొరగా ఇస్తున్న సబ్సిడీలతో రైతులు అతికష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఉపాధిహామీ పథకాన్ని కూడా నీరుగార్చడంతో మల్బరీ రైతులకు ఇబ్బందిగా తయారైంది. గతంలో షెడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.3 లక్షల వరకు రాయితీ వర్తింపజేశారు. ఇప్పుడు ఉపాధిని తీసేయడంతో షెడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. మార్కెట్‌లో పట్టుగూళ్ల ధరలు కూడా 2021, 2022లో మాదిరిగానే ఇప్పుడూ అవే ధరలు పలుకుతుండటంతో పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో గిట్టుబాటు కావడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు రేషం సాగుపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో సాగులో ఉన్న పంటను సైతం తొలగిస్తున్నట్లు చెబుతున్నారు.
1000 ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం
ఉమ్మడి అనంతపురం జిల్లా 2020, 2021 సంవత్సరాల్లో 45 వేల ఎకరాల మల్బరీ సాగుతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. 2022లో జిల్లాల విభజన తర్వాత మల్బరీ అధికంగా ఉన్న మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి ప్రాంతాలు శ్రీసత్యసాయి జిల్లాలోకి వెళ్లాయి. అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు 5 వేల ఎకరాలకు పరిమితమైంది. అనంతపురం, కళ్యాణదుర్గంలో చిన్నపాటి సీడ్‌ఫారాలు ఉండగా.. తాడిపత్రిలో ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ పాక్షికంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సీడ్‌ఫారాలు, చాకీ సెంటర్లు, రీలింగ్ యూనిట్లు, మార్కెట్లు తదితర సదుపాయాల విషయంలో శ్రీసత్యసాయి జిల్లాతో పోల్చుకుంటే అనంతపురం జిల్లా నామమాత్రమే. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం, రాయితీ పథకాలు లేకపోవడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ–క్రాప్ నివేదిక పరిశీలిస్తే... మల్బరీ సాగు కేవలం 1,000 ఎకరాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇంత దారుణంగా పడిపోవడంపై ఆ శాఖ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. కళ్యాణదుర్గం డివిజన్ పరిధి కుందుర్పి, బ్రహ్మసముద్రం మండలాల్లోనే మల్బరీ సాగులో ఉండగా... మిగతా ఉరవకొండ, అనంతపురం, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో 5 నుంచి 10 ఎకరాల చొప్పున ఉండటం గమనార్హం.
‘అనంత’పై శీతకన్ను
జిల్లా పట్టుపరిశ్రమశాఖపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం శీతకన్ను వేసింది. అంతో ఇంతో రైతులకు సేవలందిస్తున్న నర్సరీ క్షేత్రం కూడా లేకుండా చేసేశారు. జిల్లా కేంద్రంలో 6.80 ఎకరాల్లో హరితవనంగా విస్తరించిన కార్యాలయ ఆవరణలో నాలుగు ఎకరాలు ఫ్లాటెడ్ ప్యాక్టరీ నిర్మాణం కోసం ఇటీవల ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు అప్పగించడంతో నర్సరీ పెంపకానికి ఇబ్బందిగా మారింది. కార్యాలయ భవనాలు దెబ్బతిన్నా రిపేరీకి కూడా నిధులు లేవని ఆ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సిబ్బంది కొరత కూడా వేధిస్తుండటంతో పట్టు సాగు విస్తీర్ణం పెంపు, రైతులకు సేవలు అందించడంలో విఫలమవుతున్నట్లు చెబుతున్నారు. ఉపాధి పథకం వర్తింపు, బడ్జెట్ కేటాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో చంద్రబాబు ప్రభుత్వం కరుణిస్తే తప్ప ‘అనంత’లో పట్టుకు పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
పైసా బడ్జెట్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం
ఉపాధి, ప్రోత్సాహం లేక రేషం పంటపై రైతుల అనాసక్తి
1000 ఎకరాల కనిష్ట స్థాయికి పడిపోయిన మల్బరీ పంట
‘పట్టు’ కోల్పోతున్న అనంత


