పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల?
ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పర్యాటకంగా, ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతున్న పెన్నహోబిలానికి ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ప్రతి శని వారం భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పోటెత్తుతుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాజకీయ నేతల జోక్యం పెరిగిపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్లను భరించలేక ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ)గా వచ్చిన వారు విధులు నిర్వహించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో ఆలయ నిర్వహణ, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. భక్తులకు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారు.
నూతన రథం నిర్మాణానికి ఇంకెన్నాళ్లో..?
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డాయి. 400 ఏళ్ల నాటి పురాతన రథం 2022లో కుప్పకూలింది. దీంతో నూతన రథం నిర్మాణానికి 2023 అక్టోబర్‌లో టెండర్లు ఆహ్వానించారు. 43 అడుగుల రథం నిర్మాణం కోసం రివర్స్ టెండరింగ్ విధానంలో రూ.1.70 కోట్లకు గౌతంరెడ్డి అనే టెండరుదారు నిర్మాణ పనులు దక్కించుకున్నారు. రథం నిర్మాణం కోసం భక్తుల నుంచి రూ.కోటి దాకా విరాళాలు అందాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరగని రీతిలో రథం తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ అత్యంత నాణ్యత కలిగిన నాలుగు చక్రాలను సిద్ధం చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో తదుపరి పనులు ఆగిపోయాయి. తదనంతరం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. రథం నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని భావించిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండేళ్లవుతున్నా రథం నిర్మాణం ముందుకు సాగలేదు. రథం నిర్మాణ కాంట్రాక్టు గడువు కూడా మరికొన్ని నెలల్లో ముగియనుంది. ఆ లోపు రథం నిర్మాణం పూర్తవడం ప్రశ్నార్థకంగా మారింది.
ముక్కోటి ఏకాదశి వేడుకలపై
పెన్నహోబిలం దేవస్థానానికి నాలుగు నెలలుగా కార్యనిర్వహణ అధికారి (ఈఓ) లేరు. దీంతో ఇక్కడ పనిచేసే 10 మంది రెగ్యులర్, మరో 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి. ఆలయంలో స్వామి వారి విలువైన ఆభరణాలకు కూడా భద్రత లేకుండాపోయింది. రెగ్యులర్ ఈఓను నియమించి పాలనను గాడిలో పెట్టాలని భక్తులు కోరుతున్నా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి. ఆరోజు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేసే నాథుడే లేకుండా పోవడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రోజు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే అవకాశం కూడా కనపడడం లేదు.
పడకేసిన ఆలయ అభివృద్ధి
ఆర్థిక మంత్రి ఇలాకాలో ఆలయ పాలన అస్తవ్యస్తం
లక్ష్మీనరసింహస్వామి రథం నిర్మాణానికి గ్రహణం
రాజకీయ నేతల ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఈఓలు
ప్రశ్నార్థకంగా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు
ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేసేవారేరీ..?
అనుమతులు రాగానే చేపడతాం
మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ చూపి దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశిస్తే రీఎస్టిమేట్‌తో లక్ష్మీనృసింహుని నూతన రథం నిర్మాణ పనులు చేపడతాం. ఇప్పటికే రథానికి సంబంధించి నాలుగు చక్రాలు పూర్తయ్యాయి. అనుమతులు రాగానే పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– గౌతంరెడ్డి, కాంట్రాక్టర్,
అనంతపురం
‘ఏకాదశి’ ఏర్పాట్లు ఇబ్బందికరమే
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓగా ఎవరిని నియమించినా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. గుంతకల్లు గ్రూప్ టెంపుల్స్ ఈఓ మఠం మల్లికార్జునకు ఈఓగా ఆర్డర్స్ ఇచ్చినా ఆయన చార్జ్ తీసుకోలేదు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ముక్కోటి ఏకాదశి వేళ ఈఓ లేకుంటే వేడుకలకు ఏర్పాట్లు చేయడం ఇబ్బందికరమే.
– మల్లికార్జున ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్,
దేవదాయ శాఖ, అనంతపురం
పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల?
పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల?


