ఆ టీచర్లకు సర్వీస్ పాయింట్లు ఇవ్వాలి
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: రెండు డీఎస్సీల్లో సెలెక్ట్ అయి ప్రస్తుత బదిలీల్లో తీవ్రంగా నష్ట పోతున్న ఉపాధ్యాయులకు మొదటి నుంచి సర్వీస్ పాయింట్లు కేటాయించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ఉపాధ్యాయుడు మొదట ఎస్జీటీగా ఎంపికై న తర్వాత అన్ని అనుమతులతో ఎస్‌ఏగా సెలెక్ట్ అయినవారు ఒకే సర్వీస్ పుస్తకంలో అతని సర్వీస్ రాశారని వివరించారు. గత బదిలీల్లో సర్వీస్ పాయింట్లు వచ్చినా.. ప్రస్తుత బదిలీల్లో ఎస్‌ఏలుగా సెలెక్ట్ అయినప్పటి నుంచి సర్వీస్ పాయింట్లు మాత్రమే ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌లో వస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి వారికి క్యాడర్‌తో నిమిత్తం లేకుండా సర్వీసులో చేరినప్పటి సర్వీస్ పాయింట్స్ ఇవ్వాలన్నారు. అలాగే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు సక్రమంగా రూపొందించలేదన్నారు. కొన్ని మండలాల్లో అన్ని అర్హతలు ఉన్నా యూపీ పాఠశాలలను కొనసాగించకుండా మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేశారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని యూపీ పాఠశాలలుగా కొనసాగించక పోవడం చాలా అన్యాయమన్నారు.
గవి మఠం భూముల వేలం రద్దు చేయాలి
అనంతపురం అర్బన్: గవి మఠం భూముల వేలాన్ని రద్దు చేయాలని డీఆర్‌ఓ ఎ.మలోలకు సీపీఐ నాయకులు విన్నవించారు. ఈ మేరకు డీఆర్‌ఓని గురువారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామంలో గవి మఠానికి సంబంధించి సర్వే నంబరు 590బి లో 12.5 ఎకరాలు, 835లో 39.63 ఎకరాలను 30 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్నారన్నారు. దీనికి సంబంధించి గుత్త కూడా చెల్లిస్తున్నారన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న ఈ భూములను శుక్రవారం వేలం వేసేందుకు దేవదాయ శాఖ సిద్ధపడిందన్నారు. భూములు వేలం వేస్తే సాగుదారులైన పేదల కుటుంబాలు వీధిపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సాగులో ఉన్నవారికే భూములను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రాయుడు, రామాంజినేయులు, సాగుదారులు పాల్గొన్నారు.


