ఆర్టీసీలో కదిలిన అక్రమాల డొంక
అనంతపురం క్రైం: ఆర్టీసీలో జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో చోటు చేసుకున్న అక్రమాల తీగ లాగిన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్టీసీ ఆదాయానికి పటిష్ట రక్షణ కవచంగా ఉండాల్సిన విజిలెన్స్ విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులే అందిన కాడికి దోచుకున్నట్లుగా ఇప్పటికే విచారణాధికారులు నిగ్గు తేల్చారు. కడప జోనల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు ఊతమిచ్చిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ అవినీతి సెగ ప్రస్తుతం ప్రధాన కార్యాలయాన్ని తాకింది.
ముజఫర్ ముఠాకు మహిళా అధికారి దన్ను
ముజఫర్ అక్రమాలపై కొందరు బాధితులు నేరుగా విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన కార్యాలయంలోని విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఓ మహిళా అధికారినికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న సదరు అధికారి రంగంలోకి దిగి విచారణ పేరుతో నాటకీయ పరిణామాలకు తెరలేపారు. చివరకు ముజఫర్ ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదంటూ ఓ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే క్లీన్‌చిట్ ఇచ్చేందుకు ముజఫర్ నుంచి రూ.5 లక్షలు సదరు అధికారి తీసుకున్నట్లు తాజా విచారణలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు అధికారి వెంటనే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయినట్లు విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆమె అక్రమాలకు సంబంధించిన బలమైన ఆధారాలను విచారణాధికారులు సేకరించారు. ఈ నివేధిక ఇంకా ప్రధాన కార్యాలయానికి చేరకనే ఆమె లాంగ్ లీవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.
లోతైన దర్యాప్తు చేయాలి
ముజఫర్ రహిమాన్ పని చేసిన సమయంలో ఉద్యోగులు, కార్మికులపై వచ్చిన అన్ని ఆరోపణలపై తిరిగి విచారణ చేపట్టాలని ఆర్టీసీలోని వివిధ యూనియన్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఓ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిపాలని కోరుతున్నారు. ఈ విచారణ జరిపితే అనంతపురం రీజినల్ కార్యాలయంలోని పెద్దల అవినీతి బాగోతాలు కూడా బయటపడతాయని వాదిస్తున్నారు.
వెలుగు చూస్తున్న అక్రమాల బాగోతం
కింది స్థాయి సిబ్బందిపై ఆరోపణ వస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా విచారణ పేరుతో పిలిపించి అందిన కాడికి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ దోచుకున్నారు. ఈ క్రమంలో తప్పుచేసిన వారు బయటపడ్డామని సంబరపడితే.. ఎలాంటి తప్పు చేయని వారు అనవసరంగా డబ్బు పొగొట్టుకున్నామని బాధపడ్డారు. ఈ అక్రమాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో కడప జోనల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఈ తరహా బాధితులు సుమారు 60 మందికి పైగా ఉన్నట్లు విచారణ అధికారులు నిగ్గు తేల్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ముజఫర్ రహిమాన్ ఇష్టారాజ్యంగా అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూసింది. ఈ మొత్తం వ్యవహారం చూసిన విచారణాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మలుపు తిరిగిన ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అక్రమాల బాగోతం
భారీగా ముడుపులు దండుకుని తప్పుడు నివేదిక ఇచ్చిన విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్
వాస్తవాలు బయటపడడంతో దీర్ఘకాలిక సెలవులో అధికారి
జోనల్ విజిలెన్స్ అధికారి ముజఫర్ రహిమాన్ బాధితుల జాబితా చూసి తలలు పట్టుకుంటున్న అధికారులు


