హనుమజ్జయంతికి ముస్తాబు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ కే.వాణి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని ఈఓ కార్యాలయం ముందు భాగంలో ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేసి.. అక్కడ 108 కలశాలను ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు యాగాలు, హోమాలు నిర్వహిస్తారు. ఈనెల 18వ తేదీన నెట్టికంటి ఆంజనేయ స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. సాయంత్రం ఆలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తికి తులసీ దళాలతో లక్షార్చన పూజ చేస్తారు. ఈనెల 19వ తేదీన నెట్టికంటి ఆంజనేయ స్వామిని డ్రైప్రూట్స్‌తో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. 20వ తేదీన ఆంజనేయుడిని గంధంతో అలంకరిస్తారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన పూజ చేస్తారు. 21వ తేదీన యాగశాలలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అష్టోత్తరశత కలశాలతో స్వామికి మహాభిషేకం చేయనున్నారు. వివిధ రకాల పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి మల్లెపూలతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. 22వ తేదీన హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడిని స్వర్ణ, వజ్ర కవచాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పుష్పాలు, తోమాలంకరణ అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. ఆలయ ముఖ మండపంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించి పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు.
కసాపురంలో రేపటి నుంచి హనుమజ్జయంతి
ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు


