
వృద్ధురాలిని ఏమార్చి చైన్ స్నాచింగ్
గార్లదిన్నె: వృద్ధురాలిని ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగుడు అపహరించుకెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన వృద్ధురాలు నీలావతి బుధవారం మండల కేంద్రంలో కిరాణా సరుకులు కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై గుడ్డాలపల్లి క్రాస్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో తలకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు వృద్ధురాలి పక్కనే వాహనాన్ని ఆపి తాను కూడా గుడ్డాలపల్లికి వెళుతున్నట్లు నమ్మబలికి ఆమెను ఎక్కించుకుని ముందుకు కదిలాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వాహనాన్ని ఆపి తనకు ఫోన్‌కాల్ రావడంతో వెనక్కి వెళ్లాల్సి ఉందని తెలపడంతో వృద్ధురాలు కిందకు దిగింది. ఆ సమయంలో ఆమె మెడలోని 5 తులాల బంగారు చైన్‌ను లాక్కొని ద్విచక్ర వాహనంపై వేగంగా జాతీయ రహదారి వైపుగా ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.
పాఠశాలలో
ఆకతాయిల విధ్వంసం
ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్‌లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్‌కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్‌ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.