తాడిపత్రి టౌన్: ఈ నెల 21న తాడిపత్రిలో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి ఓ వర్గానికి చెందిన 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ సాయిప్రసాద్ ఆదివారం వెల్లడించారు. కాగా, రంజాన్ వేళ స్థానిక వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు ఫయాజ్‌బాషా ఈ నెల 21న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దఎత్తున తన అనుచరులను ఉసిగొల్పి పోలీసుల సమక్షంలోనే ఫయాజ్ ఇంటిపై దాడి చేయించిన వైనం సంచలనం రేకెత్తించింది. ఆ సమయంలో టీడీపీ వర్గీయులు జరిపిన రాళ్ల దాడిలో అదే పార్టీకి చెందిన కార్యకర్త వరుణ్ గాయపడ్డాడు. దీంతో వరుణ్ ఫిర్యాదు ఆధారంగా వైఎస్సార్‌సీపీకి చెందిన 17 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధం
గార్లదిన్నె: మండలంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఓ లారీ దగ్ధమైన ఘటన మరువక ముందే మరో లారీకి మంటలు వ్యాపించాయి. వివరాలు... ఈ నెల 20న రాజస్తాన్‌లోని కోటా నగరం నుంచి బెంగళూరుకు గోధుముల లోడుతో బయలుదేరిన లారీ ఆదివారం మధ్యాహ్నం గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారి పక్కన వాహనాన్ని డ్రైవర్ ఆపి క్లీనర్‌తో కలసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో లారీ ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. ఘటనలో దాదాపు రూ.30 లక్షల విలువైన సరుకు కాలిబూడిదైనట్లు డ్రైవర్ తెలిపాడు. ఘటనపై ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తోటలో వ్యభిచారం
గార్లదిన్నె: మండల కేంద్రం సమీపంలోని ఓ తోటలో వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను గార్లదిన్నె పీఎస్ ఎస్‌ఐ గౌస్ మహమ్మద్‌బాషా వెల్లడించారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రతి ఆదివారం ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు యువతలను రప్పించుకుని తోటలో గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నెల్లూరుకు చెందిన ఓ యువతి పట్టుబడింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేషన్ బియ్యం స్వాధీనం
గార్లదిన్నె: మండలంలోని ముంటిముడుగులో ఆదివారం 32 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ఈరమ్మ తెలిపారు. కల్లూరుకు చెందిన రమేష్ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ముంటిమడుగులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేశాడన్నారు. ఈ నిల్వలను ఆదివారం కర్ణాటకకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.