దంపతుల్ని చిదిమేసిన ఐషర్‌ | - | Sakshi
Sakshi News home page

దంపతుల్ని చిదిమేసిన ఐషర్‌

Sep 24 2024 2:28 AM | Updated on Sep 24 2024 10:33 AM

-

అదుపుతప్పి బైకుపై బోల్తా పడ్డ టమాట వాహనం

ఘటనాస్థలిలోనే దంపతుల దుర్మరణం

అనంతపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన నగర శివారు నేషనల్‌ పార్కు సమీపంలో జరిగింది. వివరాలు.. గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన కమతం హనుమంత రెడ్డి (72), కమతం రంగమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, కాంతమ్మ, కృష్ణకుమారి, ఒక కుమారుడు నాగేశ్వర రెడ్డి సంతానం. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. నాగేశ్వర రెడ్డి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నారు. 

అనంతపురంలోని చిన్మయనగర్‌లో నివాసముండే కుమార్తెలను చూసేందుకు ప్రతి వారం హనుమంత రెడ్డి, రంగమ్మ వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలోనే సోమవారం వచ్చి తిరిగి స్వగ్రామం బయలుదేరారు. నేషనల్‌ పార్కు వద్ద వెళ్తున్న సమయంలో ఓ ఐషర్‌ వాహనం అదుపుతప్పి బైకుపై పడిపోయింది. తీవ్ర గాయాలైన దంపతులిద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద ధాటికి హనుమంతు రెడ్డి తల తెగిపోయింది. 

కక్కలపల్లి మండీలో టమాట బాక్సులు లోడు చేసుకున్న ఐషర్‌ డ్రైవర్‌ ముంబైకు వెళ్తున్నట్లు తెలిసింది. నేషనల్‌ పార్కు సమీపంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగం అదుపు కాకపోవడంతో బోల్తా కొట్టి పక్కనే హనుమంత రెడ్డి, రంగమ్మలు వెళ్తున్న బైకుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతుల కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement