అనంతపురం టౌన్: ‘అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నాశనం అవుతోంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఏమాత్రమూ గుర్తింపు లేద’ని నగరంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు దూదేకుల రఫీ వాపోయారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించాలని కోరుతూ శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘టీడీపీ కోసం పని చేశావు.. 20కి పైగా కేసులు పెట్టించుకున్నావు.. ఏమి సాధించావు?’ అంటూ తన భార్య మాట్లాడుతోందని, ఆమెకు ఏమని సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను కోరారు. ఆయనకు పదవి ఇస్తేనే పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏమి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నవోదయకు దరఖాస్తు చేసుకోండి
పుట్టపర్తి/లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో (2027–28 విద్యా సంవత్సరానికి) 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప, లేపాక్షి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ ఏడాది నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
జానకి లేనిలోటు తీర్చలేనిది
అనంతపురం కల్చరల్: ప్రముఖ గాయని ఎస్.జానకి లేకరనే వార్త అనంత కళాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలోని స్వర దిగ్గజాలకు అనంతపురంతో ఎంతో అనుబంధం ఉంది. ఆ కోవలోనే శనివారం పరమపదించిన ఎస్.జానకి జిల్లా వాసులతో ప్రత్యేకమైన సంగీత బంధాన్ని పోగుచేసుకున్నారు. అనంత కళావాహిని సంస్థ వారు వరం వెంకటేశ్వర్లు నేతృత్వంలో 2014 మార్చి నెలలో ఎస్.జానకిని అనంతపురానికి రప్పించి సంగీత కచేరీ చేయించారు. ఆ సందర్భంగా జానకిని కనకాభిషేకంతో సత్కరించారు. ఆమెతోటి అనుబంధాన్ని, విలక్షణ గాత్ర మాధుర్యాన్ని గుర్తు చేసుకున్నారు. త్యాగరాజ సంగీత సభ వ్యవస్థాపకులు జ్ఞానేశ్వరరావుతో పాటు లలితకళాపరిషత్తు కార్యదర్శి పద్మజ, సంగాల నారాయణస్వామి, సోమిరెడ్డి, అనంత కళావాహిని ప్రతినిధులు రమేష్‌నీల్, వరప్రసాద్, గాయకులు జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, లతాశ్యామ్, ఆచార్య సుధాకరబాబు, నాట్యాచార్యులు సంధ్యామూర్తి, ఓబుళదాసు, రామయ్య, పాలసముద్రం నాగరాజు ఎస్.జానకి లాంటి మధుర గాయని పుట్టరని, ఆమె లేనిలోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
11,898 కేసుల పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 11,898 కేసులకు న్యాయ పరిష్కారం లభించింది. అనంతపురంలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ లోక్ అదాలత్ తీర్పునకు ఎలాంటి అప్పీల్ చేసే అధికారమూ ఉండబోదని స్పష్టం చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అనే లక్ష్యంతో లోక్ అదాలత్‌లో కేసులకు పరిష్కారం చూపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫస్ట్ ఏడీజే సి.సత్యవాణి, అదనపు న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తులు, జూనియర్ న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మజ, వివిధ బ్యాంకు శాఖల మేనేజర్లు, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, న్యాయవాదులు, పలు కేసులకు సంబంధించిన కక్షిదారులు పాల్గొన్నారు.


