అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 21న ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రచురిస్తారు. 14వ తేదీ వరకు ఓటర్ల నుంచి అందిన ఎన్యుమరేషన్ ఫారాలను (ఈఎఫ్) డిజిటలైజేషన్ చేస్తారు. ఈఎఫ్ డిజిటలైజేషన్ అయిన వారి ఓటు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటుంది. ఈఎఫ్ ఇవ్వని వారి ఓటు ఉండదు.
ఈఎఫ్‌ను తప్పక సమర్పించాలి
సర్ ప్రక్రియలో ప్రతి ఓటరూ ఎన్యుమరేషన్ ఫారాన్ని (ఈఎఫ్) పూరించి ఇవ్వడం అత్యంత కీలకం. ఫారంలో అడిగిన విధంగా 2002కు సంబంధించిన సమాచారం లేకపోయినప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారంతో బీఎల్‌ఓకు అందజేయాలి. అంతే తప్ప సమాచారం లేదా వివరాలు లేవనే కారణంతో ఈఎఫ్ ఇవ్వకపోతే అలాంటి వారు వారి ఓటును వారే లేకుండా చేసుకున్నవారవుతారు. వీలైనంత వరకు 12వ తేదీ (ఆదివారం) ప్రత్యేక డ్రైవ్‌లో బీఎల్‌ఓకు ఈఎఫ్ ఇచ్చేయ్యాలి. ఒకవేళ ఇవ్వలేక పోతే 13వ తేదీన తప్పనిసరిగా అందజేయాలి. వాటిని బీఎల్‌ఓ వెంటనే డిజిటలైజేషన్ చేస్తారు. 14వ తేదీ ఆఖరు కావడంతో ఆ రోజున సర్వర్‌పై ఒత్తిడి అధికంగా ఉంటుంది. కనుక ఆలోపే అందజేయాల్సి ఉంటుంది.
బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఓటరు ఈఎఫ్‌ను పూరించి బీఎల్‌ఓకు ఇచ్చేలా చూడాలి. తమ పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లతో స్వయంగా మాట్లాడి ఈఎఫ్ అందజేశారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. ఎవరైనా ఇవ్వకపోయి ఉంటే 13వ తేదీలోగా ఈఎఫ్ సమర్పించేలా చేయాలి.
ఆందోళన చెందవద్దు
అర్హులై ఉండి ఏదేని కారణం చేత ఈఎఫ్ సమర్పించలేక పోయిన వారి ఓటు ముసాయిదాలో ఉండదు. ఓటు లేపోయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈనెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీలోగా ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. వాటిని సెప్టెంబరు 18వ తేదీలోగా పరిశీలించి అర్హత ఉంటే ఓటరుగా నమోదు చేస్తారు. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబరు 22న ప్రచురిస్తారు.
14తో ముగియనున్న ఎన్యుమరేషన్ ప్రక్రియ
21న ముసాయిదా జాబితా ప్రచురణ
ప్రతి ఓటరూ ఈఎఫ్ సమర్పించడం కీలకం
ఈఎఫ్ ఇవ్వకపోతే ముసాయిదాలో ఓటు ఉండదు


