చెత్తతో సంపద తయారీ కేంద్రం నిర్మాణ పనులు అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఫలహారంగా మారాయి. నిర్దేశిత వ్యయానికి మించి బిల్లులు చేసుకున్నారు. ప్రజాధనాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు.
● ‘చెత్త’ కేంద్రాల నిర్మాణాల్లో అక్రమాలు
● నిర్మాణ వ్యయం భారీగా పెంపుదల
● జేబులు నింపుకున్న ‘తెలుగు’ తమ్ముళ్లు
అనంతపురం న్యూటౌన్: గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లనుంచి సేకరించే చెత్తచెదారంతో ‘సంపద’ సృషించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆగమేఘాలపై పథకం రూపు దాల్చింది. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలో చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాల (ఎస్‌డబ్ల్యూపీసీ) ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం ఈ కార్యక్రమానికి నిధుల వనరుగా మారింది. ఓ వైపు వలస కూలీలకు ఉపాధి చూపిస్తున్నా మంటూనే.. మరోవైపు రూ.కోట్లల్లో దోపిడీకి తెర తీశారు.
రెట్టింపు వ్యయంతో అక్రమాలు
చెత్తతో సంపద తయారీ కేంద్రాల నిర్మాణానికి మండల కేంద్రాల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేయాలని అధికారులు భావించారు. గ్రామ స్థాయిలో జనాభా ఆధారంగా కేంద్రం నిర్మాణానికి రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షలుగా నిర్ణయించారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మరోలా మారాయి. సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలపై తెలుగుదేశం పార్టీ నాయకుల కన్ను పడింది. కాంట్రాక్టర్ల అవతారమెత్తి నిర్మాణ పనులను చేజిక్కించుకున్నారు. రూ.4 లక్షలలోపే పూర్తయ్యే సంపద తయారీ కేంద్రాల నిర్మాణ వ్యయం రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షలకు చేర్చారన్న కఠిన వాస్తవాలకు అధికారిక లెక్కలే నిలువెత్తు సాక్ష్యం. జిల్లాలోని 578 గ్రామ పంచాయతీలకు గాను 559 చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణం పూర్తయినట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. వీటి నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.19,84,61,000 ఖర్చు చేశారు. ఇది తెలుగు తమ్ముళ్ల సంపదకు ఉపాధి మార్గంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


