
ఎస్పీ అమిత్ బర్దర్
అనంతపురం: జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ అమిత్ బర్దర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సేవానిరతి, పవిత్రతలకు ప్రతీక రంజాన్ పర్వదినమని పేర్కొన్నారు. సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవ చింతన, భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ముస్లిం సోదరులు తమ ఇష్ట దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయమన్నారు. అల్లాహ్ కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: 2024–25 విద్యా సంవత్సరంలో ఆదర్శ (మోడల్) స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. ఈనెల 21న అర్హత పరీక్ష ఉంటుందని డీఈఓ బి.వరలక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు https://cse.ap.gov.in/ లేదా https://apms. apcfss.in/studentLogin. do వెబ్‌సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయొచ్చన్నారు.
కసాపురం వద్ద
తెగిన విద్యుత్ లైన్
● గుర్తించిన పెట్రోలింగ్ గ్యాంగ్
● వేగంగా సరఫరా పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: విద్యుత్ లైను తెగిన కారణంగా గుంతకల్లు వద్ద 132 కేవీ గుత్తి రిసీవింగ్ స్టేషన్(ఆర్‌ఎస్) సింగిల్ సర్క్యూట్ లైన్ బుధవారం ఉదయం 8:15 గంటలకు ట్రిప్ అయింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్‌కో అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. గుత్తి గ్యాంగ్ ఫీడర్‌పై పెట్రోలింగ్ చేసినప్పుడు ఫేజ్ కండక్టర్ స్నాప్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఉదయం 8:20 గంటలకు బ్రేక్‌డౌన్ ప్రకటించారు. 132కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని గుంతకల్లు–ఉరవకొండ ప్రాంత గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా కోసం 33కేవీ స్థాయి ఫీడర్ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. రైల్వేకు సంబంధించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా 220 కేవీ లైన్ ద్వారా గుత్తి నుంచి అనుసంధానం చేశారు. గుంతకల్లు – కసాపురం గ్రామ రహదారి వద్ద బ్రేక్‌డౌన్ సైట్‌కు చేరుకున్న సాంకేతిక సిబ్బంది కండక్టర్ రెసిడెన్షియల్ ప్రాంతం (జర్నలిస్ట్ కాలనీ)లో పడిపోయిన దాదాపు 100 మీటర్ల కండక్టర్‌ను భర్తీ చేశారు. ఫేజ్ కండక్టర్ ఫీడర్‌ను సరిగ్గా నిలిపి మిడ్–స్పాన్ జాయింట్ వేశారు. మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం మధ్యాహ్నం 2.44 గంటలకు లైన్ ఛార్జ్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఫీడర్ సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే గృహ, వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
పెద్దపప్పూరు: పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో 136,137, పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నికల దృష్ట్యా ఎటువంటి సమస్య చోటు చేసుకున్నా సంబంధిత అధికారులకు తక్షణ సమాచారం అందించాలని మండల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.