
రాప్తాడు రూరల్: ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో వణికిన రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో ప్రశాంత వాతావరణం నెలకొంది. తాజాగా టీడీపీ నేతల వ్యాఖ్యలు మళ్లీ ఫ్యాక్షన్ గొడవలకు ఆజ్యం పోస్తాయేమోనని రాప్తాడు నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన నెలకొంది. పరిటాల అండ చూసుకుని కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలోని ప్రభుత్వ స్థలంలో యాదవుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భూమి పూజ చేశారు. బీసీలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఆత్మకూరు మండల టీడీపీ మాజీ కన్వీనర్ కృష్ణమోహన్‌చౌదరి ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. వడ్డుపల్లిలో తమను కాదని శ్రీకృష్ణ ఆలయం ఎలా నిర్మిస్తారో చూస్తామని ఆయన బెదిరించారు. ‘ఈ విషయం ఇప్పటికే పరిటాల సునీత ఎస్సైకు కూడా చెప్పింది. గుడి కట్టినా, బడి కట్టినా మన టైం రాగానే అన్నీ పగలకొడతాం’ అంటూ కృష్ణమోహన్ చౌదరి మాట్లాడటం కలకలం రేపింది. గ్రామాల్లో టీడీపీ నేతల ఇలాంటి వ్యాఖ్యలు ఫ్యాక్షన్ తరహా మనస్తత్వాలకు అద్దం పడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పరిటాల కుటుంబం వస్తే మళ్లీ పాత రోజులే!
ప్రశాంతంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం మళ్లీ ఫ్యాక్షన్ గొడవలకు ఆజ్యం పోస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురంలో టీడీపీ కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘మీరంతా ఒకటి గుర్తు పెట్టుకోండి. మన ప్రభుత్వంలో వైఎస్ విగ్రహాన్ని పగలకొట్టి మెడకు తాడేసి అక్కడిదాకా ఈడ్చుకుంటూ పోయాం. దానికి వాళ్లు ఏమై ఉంటారో ఆలోచించండి. మన ప్రభుత్వం రాగానే మళ్లీ అదే జరుగుతుంది.’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. పరిటాల కుటుంబానికి మళ్లీ అవకాశం ఇస్తే పాత రోజులు వస్తాయనే చర్చ ప్రజల్లో సాగుతోంది.
పరిటాల రక్తదాహానికి ఎందరో బలి
గతంలో రాప్తాడు నియోజకవర్గం పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలే గుర్తుకొచ్చేవి. ఆ భూతానికి ఎన్నో కుటుంబాలు సమిధలుగా మారాయి. టీడీపీ నేత పరిటాల రవీంద్ర హయాంలో ఈ నరమేధానికి అంతేలేదు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక సామాజిక వర్గం లక్ష్యంగా ఊచకోత జరిగిందని నేటికీ చెబుతారు. అప్పట్లో మాయమైన కొందరి ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. పరిటాల సునీత మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ ఈ ప్రాంతంలో నిత్యం దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో రౌడీ రాజ్యం సాగిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ఆనవాళ్లు లేకుండా చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన రెండోరోజే బహిరంగ లేఖ రాశారు. ఎక్కడైనా టీడీపీ వాళ్లు కవ్వింపు చర్యలకు దిగినా సంయమనం పాటించాలని.. ప్రతిచర్యలకు పాల్పడొద్దని శ్రేణులను కోరారు. ఎవరైనా గొడవలు, దౌర్జన్యాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది.
మళ్లీ ‘పరిటాల’ అరాచకం!
ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న అనుచరులు
గుడి కట్టినా, బడి కట్టినా
పగలగొడతామన్న
ఫోన్ సంభాషణలు వైరల్
పరిటాల కుటుంబానికి అవకాశమిస్తే మళ్లీ పాత రోజులే!