ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ సీజ్‌

Mar 15 2026 1:18 AM | Updated on Mar 15 2026 1:18 AM

బొమ్మనహాళ్‌: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో శనివారం జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు దాడులు నిర్వహించి ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు. కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్‌ బోయ మల్లికార్జున, ఉరవకొండ మండలం బుడిదగవ్వి గ్రామానికి చెందిన వడ్డే రాంబాబు, ఉండబండ గ్రామానికి చెందిన బంగి చందు, కల్లుహోళ గ్రామానికి చెందిన కాకుల వన్నూరుస్వామి, కుమ్మరి నాగేంద్ర, బోయ వన్నూరుస్వామిని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి జేసీబీ, ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇసుక కావాల్సిన వారు తహసీల్దార్‌ వద్ద అనుమతి తీసుకోవాలని, అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్రీడా పోటీలతో

మానసిక ఉల్లాసం

ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం సంపత్‌కుమార్‌

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ సర్కిల్‌ డేను పురస్కరించుకుని విద్యుత్‌ ఉద్యోగులకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో పని చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, క్రికెట్‌ తదితర క్రీడా పోటీలను జేఎన్‌టీయూ కళాశాల సమీపంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి సీఎండీ శివశంకర్‌ లోతేటి వస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎస్‌ఈలు శేషాద్రి శేఖర్‌, మోసెస్‌తోపాటు ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.

చదువు భారమని

యువకుడి బలవన్మరణం

పెద్దవడుగూరు: చదువు భారమని భావించిన యువకుడు బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. విరుపాపురానికి చెందిన మార్నె నరసింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరి పెద్ద కుమారుడు మార్నె కల్యాణ్‌ (20) ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయ్యాడు. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు కట్టి పరీక్షలు రాయమని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణ్‌ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చీకటి పడినా తిరిగి రాలేదు. కొత్తపల్లి బస్టాండ్‌ సమీపంలోని కాశేపల్లి చెన్నారెడ్డి తోట వద్ద ఎప్పుడూ ఉండేవాడని తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లి గాలించారు. అక్కడ చెట్టుకు ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. కిందికి దింపి పామిడి ఆసుపత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజినేయులు తెలిపారు.

గుంతలో పడి వృద్ధురాలు మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: గుంతలో పడి తిప్పమ్మ (83) అనే వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కుర్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. కుర్లపల్లిలో ఒంటరిగా జీవిస్తున్న తిప్పమ్మ శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని గుంతలో ప్రమాదపుశాత్తు పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి తిప్పమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే తిప్పమ్మ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement