గుత్తి: పర్యాటక కేంద్రంగా గుత్తి కోటను తీర్చిద్దేందుకు కృషి చేస్తామని కలెక్టర్, ప్రజాప్రతినిధులు అన్నారు. శనివారం పట్టణంలోని ఎంఎస్ ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో గుత్తి కోట ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాళక్యులు, మరాఠీలు, విజయనగర రాజులు పాలించిన గుత్తి కోట ప్రాశస్త్యం గురించి ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తెలియజేస్తున్నారన్నారు. చారిత్రక గుత్తికోటను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గుత్తి కోటకు త్వరలో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యంతో కళాకారులు అలరించారు. డీఆర్వో మలోల సైతం పాట పాడి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఎంఎస్ ఫుట్ బాల్ క్రీడా మైదానం వద్ద నుంచి కోట వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఫుట్ బాల్ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ ఫేం శాంతికుమార్, రైజింగ్ రాజు, మోహన్ కామెడీ స్కిట్‌లు ప్రదర్శించనున్నారన్నారు. పాటల పోటీలు కూడా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, తాడిపత్రి, గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి, వన్నూర్‌బీ, వైస్ చైర్‌పర్సన్ బిందె వరలక్ష్మి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ భాస్కర్, ఆర్కియాలజీ అధికారులతో పాటు కౌన్సిలర్ వాల్మీకి శివ, వెంకటశివుడు యాదవ్, నారాయణ స్వామి, స్వప్న, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


