అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటి పన్ను వసూళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఓవైపు పన్ను చెల్లించాలంటూ పేదలను పిండేస్తున్న అధికారులు... పెద్దలను మాత్రం వదిలేస్తున్నారు. రూ. 4 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు బకాయిలున్న పెద్దల గురించి ఏమాత్రమూ ఆలోచించలేదు. కేవలం వారికి నోటీసులతో సరిపెడుతున్నారు. అదే రూ.200, రూ.300, రూ.400 పన్ను చెల్లించాల్సిన పేద, మధ్య తరగతి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. వారికి ఏమాత్రం గడువు ఇవ్వకుండా నోటీసు ఇవ్వడం.. ఆ వెంటనే కట్టి తీరాల్చిందేనంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 22 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం కాగా.. ఇప్పటిదాకా రూ. 14 కోట్లు అంటే 67 శాతం వసూలైంది. దీనివెనుక విలేజ్ డెవలప్‌మెంట్ అధికారుల (వీడీఓ) కఠోరశ్రమ చాలా ఉంది. వసూళ్లయిన మొత్తంలో పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లించిన పన్నులే అధికంగా ఉన్నాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
పంచాయతీ అధికారుల మెడపై కత్తి
పన్నుల వసూళ్ల విషయంలో ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ అధికారుల మెడపై కత్తి పెట్టి పనిచేయిస్తోంది. ‘ఏమి చేసుకుంటారో ఏమో మీ పంచాయతీ పరిధిలో వందశాతం పన్ను వసూళ్లు చేయాల్సిందేనంటూ’ హుకుం జారీ చేస్తోంది. డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీడీఓ, డీపీఓ ఇలా ఎవరిస్థాయిలో వారు ఒత్తిళ్లు చేస్తుండడంతో వీడీఓలు తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. వ్యక్తిగత పనులను కూడా చూసుకోలేనంత స్థాయిలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారంటూ వీడీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా వదిలిపెట్టడం లేదంటున్నారు.
గడువు ఇవ్వకుండా వసూలు
సహజంగా ప్రతి ఏటా మార్చి 31 వరకు పన్నులు చెల్లించేందుకు గడువు ఉంటుంది. ఆలోగా కనీసం 15 రోజుల గడువుతో పన్నుల చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత పన్నులు కట్టించుకోవాలి. తొలిసారి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పన్నులు వసూళ్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి గడువుల మీద గడువులు పెడుతూ వస్తున్నారు. చివరకు అద్దెకు ఉన్న వారిని కూడా బెదిరింపులకు దిగుతున్నారు. ‘పన్ను మీరు చెల్లించి అద్దెలో పట్టుకోండి’ అంటూ సలహాలు ఇస్తున్నారు. మరోవైపు పింఛన్లకు, ఇంటిపన్నుకు ముడిపెడుతున్నారు. ఇంటిపన్ను చెల్లించినట్లు రశీదులు చూపితేనే పింఛను ఇస్తామనే షరతు పెడుతున్నారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లకాలనీలో ఇదే తరహాలో పన్నులు వసూళ్లు చేయడం దుమారం రేపింది.
పెద్దలపై ఎక్కడాలేని ఉదారత
ఇంటి పన్ను వసూళ్లపై చంద్రబాబు సర్కార్ తీరు..
2025–26లోజిల్లా లక్ష్యం రూ. 22 కోట్లు
వంద శాతం వసూలు కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు


