సాక్షి, టాస్క్‌ఫోర్స్: మండల పరిధిలోని పలగలపల్లి పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నరేంద్రరెడ్డిపై పోలీసులు అక్రమ కేసు బనాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్లుకుంటకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు నరసింహప్పకు, అతని బంధువులకు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసులో నరేంద్రరెడ్డిని ఇరికించారు. ఆర్థిక లావాదేవీల అంశంలో గొడవ జరిగిందని, తమపైకి ప్రత్యర్థులను నరేంద్ర రెడ్డి ఉసిగొల్పాడని ఫిర్యాదుదారుడు పేర్కొనగా.. వాస్తవాలను పోలీసులు పరిశీలించకుండానే కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలతోనే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తప్పు చేయకపోయినా తనపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితుడు నరేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిళ్ల మేరకే కేసు నమోదు చేశారంటూ పోలీసులే చర్చించుకోవడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడిగా నాగమల్లేశ్వర రెడ్డి
కనగానపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడిగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన నాగమల్లేశ్వరరెడ్డిని నియమించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పూజారి లక్ష్మినరసింహులును నియమించారు.
చదువు భారమని
యువకుడి బలవన్మరణం
పెద్దవడుగూరు: చదువు భారమని భావించిన యువకుడు బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. విరుపాపురానికి చెందిన మార్నె నరసింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరి పెద్ద కుమారుడు మార్నె కల్యాణ్ (20) ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు కట్టి పరీక్షలు రాయమని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణ్ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చీకటి పడినా తిరిగి రాలేదు. కొత్తపల్లి బస్టాండ్ సమీపంలోని కాశేపల్లి చెన్నారెడ్డి తోట వద్ద ఎప్పుడూ ఉండేవాడని తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లి గాలించారు. అక్కడ చెట్టుకు ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. కిందికి దింపి పామిడి ఆసుపత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజినేయులు తెలిపారు.
గుంతలో పడి వృద్ధురాలు మృతి
కళ్యాణదుర్గం రూరల్: గుంతలో పడి తిప్పమ్మ (83) అనే వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కుర్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. కుర్లపల్లిలో ఒంటరిగా జీవిస్తున్న తిప్పమ్మ శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని గుంతలో ప్రమాదపుశాత్తు పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి తిప్పమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే తిప్పమ్మ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


