క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం

Mar 15 2026 1:29 AM | Updated on Mar 15 2026 1:29 AM

ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం సంపత్‌కుమార్‌

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ సర్కిల్‌ డేను పురస్కరించుకుని విద్యుత్‌ ఉద్యోగులకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో పని చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, క్రికెట్‌ తదితర క్రీడా పోటీలను జేఎన్‌టీయూ కళాశాల సమీపంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి సీఎండీ శివశంకర్‌ లోతేటి వస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎస్‌ఈలు శేషాద్రి శేఖర్‌, మోసెస్‌తోపాటు ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.

సివిక్స్‌ పరీక్షకు

334 మంది గైర్హాజరు

పుట్టపర్తి: సివిక్స్‌ పరీక్షకు 334 మంది ఇంటర్‌ విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్న కేశవప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని 41 కేంద్రాల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు సివిక్స్‌ పరీక్ష రాశారు. 4,299 మందికి గాను 3,965 మంది హాజరయ్యారు. 334 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. విద్యాశాఖ అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

సిలిండర్ల అక్రమ

వినియోగంపై దాడులు

అనంతపురం సెంట్రల్‌: సిలిండర్ల అక్రమ వినియోగంపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుంతకల్లులో హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర బాలాజీ కేఫ్‌లో 4 సిలిండర్లు సీజ్‌ చేసి నిర్వాహకుడు అనుముల సురేంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే గుత్తి గాంధీ సర్కిల్‌లో గ్యాస్‌ స్టౌవ్‌ రిపేరీ దుకాణంలో 12 సిలిండర్లు, గ్యాస్‌ ఫిలింగ్‌ పైపు సీజ్‌ చేసి నిర్వాహకుడు చిన్న మహమ్మద్‌పై కేసు నమోదు చేశారు. కదిరి పట్టణంలో ఓ ఇంట్లో 46 సిలిండర్లు సీజ్‌ చేసి డెలివరీ బాయ్‌పై కేసు కట్టారు.చట్ట విరుద్ధంగా విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ సీఐ గోపాలుడు, ఏఈఈ రవీంద్ర నాథ్‌, రాజశేఖర్‌, సీఎస్‌డీటీ భాగ్యలక్ష్మి, ఆర్‌ఐ రవికుమార్‌, కదిరి వీఆర్వో ఆదినారాయణమ్మ, హరీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇసుకను అక్రమంగా

తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ల సీజ్‌

బొమ్మనహాళ్‌: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో శనివారం జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు దాడులు నిర్వహించి ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు. కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్‌ బోయ మల్లికార్జున, ఉరవకొండ మండలం బుడిదగవ్వి గ్రామానికి చెందిన వడ్డే రాంబాబు, ఉండబండ గ్రామానికి చెందిన బంగి చందు, కల్లుహోళ గ్రామానికి చెందిన కాకుల వన్నూరుస్వామి, కుమ్మరి నాగేంద్ర, బోయ వన్నూరుస్వామిని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి జేసీబీ, ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇసుక కావాల్సిన వారు తహసీల్దార్‌ వద్ద అనుమతి తీసుకోవాలని, అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement