గార్లదిన్నె: మండల పరిధిలోని ముంటిమడుగు క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శనివారం పెద్దవడుగూరు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ సుబ్బరాయుడు (53) మరో ఏడుగురితో కలిసి మిషన్‌తో మొక్కజొన్న ఆడించే పనికి గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి వచ్చాడు. పని ముగిసిన అనంతరం మిషన్‌ను ట్రాక్టర్‌కు కట్టుకుని అందరూ తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ముంటిమడుగు క్రాస్ వద్ద మొక్కజొన్న మిషన్ స్టాండ్ బోల్టు ఊడి పోయింది. ఈ క్రమంలో స్టాండ్ మీద కూర్చున్న సుబ్బరాయుడితో పాటు మరో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. సుబ్బరాయుడిపై నుంచి మొక్కజొన్న మిషన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనోహర్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మికి గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. కాగా మృతుడు సుబ్బరాయుడుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది.


