అర్ధంతరంగా మూతపడిన కుట్టు శిక్షణ కేంద్రాలు
ధ్రువపత్రాలు, కుట్టు మిషన్లు అందించక పోవడంపై అసంతృప్తి
నెరవేరని మహిళల స్వయం ఉపాధి కలలు
కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న మహిళలు
కుట్టు శిక్షణ పేరిట మోసం చేశారని ఆవేదన
శిక్షణ నిలిచిపోయి ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని అధికారులు
ట్రైనీలకు సైతం నాలుగు నెలల వేతనాలు అందని వైనం
జిల్లాలో 19 మండలాల్లోని కుట్టు శిక్షణ కేంద్రాల్లో ఇదే పరిస్థితి
శిక్షణ లేదు..
దేవరాపల్లి : మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కర్డ్ (సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) ప్రైవేట్ సంస్థ మండలానికి ఒక్కటి చొప్పున కేంద్రాలు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా తొలి బ్యాచ్‌లతోనే ఈ కేంద్రాలు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. కుట్టు శిక్షణ కేంద్రాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మహిళా సాధికారత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పాలకులు ప్రచార అర్భాటం చేశారు. తీరా నిర్వహణ లోపంతో ఏడాది తిరగక ముందే ఈ పథకం అట్టర్ ప్లాప్ అయ్యింది. తొలి బ్యాచ్‌లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. తొలి దఫాలో బ్యాచ్‌లకు శిక్షణ పూర్తయి సుమారు ఏడాది కావస్తున్నా ఇటు ధ్రువీకరణ పత్రం, అటు ఉచితంగా కుట్టు మిషన్ అందించక పోవడంతో బాధిత మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పుడు ఇస్తారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. సుమారు మూడు నెలల క్రితం తొలి దఫాలో శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ టెస్టు సైతం నిర్వహించి హడావిడి చేసి ఆపై ఊసెత్తడం మానేశారు. మండల వ్యాప్తంగా సుదూర గ్రామాల నుంచి వ్యయ ప్రయాసల నడుమ మండల కేంద్రానికి వచ్చి శిక్షణ పొందిన మహిళల పరిస్థితి అయోమయంగా మారింది. కుట్టు శిక్షణతో పాటు మిషన్ ఉచితంగా అందిస్తారని ఆశ పడిన మహిళలకు తీవ్ర నిరాశే మిగిలింది. కుట్టు శిక్షణ పేరిట తమను మోసం చేశారంటూ లబ్ధిదారులైన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణ మూన్నాళ్ల ముచ్చటే...
మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లితో పాటు మాడుగుల, చీడికాడ మండలాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో శిక్షణ కేంద్రాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కె.కోటపాడు మండలంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించలేదు. ఆ మండలానికి చెందిన కుట్టు మిషన్లు దేవరాపల్లి పాత శిథిల ఎంపీడీవో భవనంలో నిరుపయోగంగా ఉన్నాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన మూడు మండలాల్లో సుమారు 1500 మంది వరకు మహిళలు కుట్టు శిక్షణకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తొలి దఫాలో శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా సర్టిఫికెట్, మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహిళలకు సుమారు రూ. 6 వేలు విలువ చేసే కుట్టు మిషన్ ఉచితంగా అందించాల్సి ఉంది. ఇందుకోసం ప్రైవేటు సంస్థలకు ఒక్కో మహిళకు రూ. 21 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయించినట్టు సమాచారం.
మూలకు చేరిన కుట్టు మిషన్లు
కుట్టు శిక్షణ అర్ధంతరంగా నిలిపివేయడంతో శిక్షణ కేంద్రాలలో కుట్టు మిషన్లు మూలకు చేరాయి. కొన్ని చోట్ల తుప్పు పట్టిపోతుండగా, మరికొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉంచడంతో వర్షాలకు కారిపోయి కుట్టుమిషన్లు తడిసిపోతున్నాయి. ఈ కుట్టు శిక్షణ కేంద్రాలకు నిధులు మంజూరు చేయకపోవడంతోనే ప్రైవేటు సంస్థ కుట్టు శిక్షణ కేంద్రాలను నిలిపివేసినట్టు సమాచారం. శిక్షణ కేంద్రాల్లో పని చేసిన ట్రైనీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు సైతం సుమారు నాలుగు నెలల వేతనం అందించకపోవడం గమనార్హం.
నాలుగు నెలల వేతనం ఇవ్వలేదు..
నాలుగు నెలల వేతనం ఇవ్వలేదు. కేంద్రం నిర్వాహకులకు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో వేతనం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమను సర్టిఫికెట్లు, మిషన్లు ఎప్పుడిస్తారని అడుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలి.
–సుకురు తేజశ్విని,
కుట్టు శిక్షణ కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్, దేవరాపల్లి
ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కుట్టుమిషన్లు ఇస్తాం..
జిల్లాలో తొలి విడతలో 19 మండలాల్లో 3182 మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో 2268 మంది మాత్రమే శిక్షణ పొందారు. నిబంధనల ప్రకారం 75 శాతం హాజరుఉన్న 1321 మందికి టెస్టులు నిర్వహించగా వీరిలో ఐదుగురు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులైన 1316 మంది మహిళలకు సర్టిఫికెట్‌తో పాటు కొత్త మిషన్లను అందజేస్తాం. వీరికి అందజేసిన తర్వాతనే రెండో దఫా కుట్టు శిక్షణ ప్రారంభిస్తాం.
–జి. గోపి, ఇన్‌చార్జి బీసీ కార్పొరేషన్ ఈడీ, అనకాపల్లి జిల్లా


