తుమ్మపాల : తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను పరిస్థితులపై సమీక్షించారు.
తుపాను ప్రభావంతో దెబ్బతినే అవకాశం ఉన్న రహదారులు, డ్రైనేజీలు, ఇతర ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు రహదారులపై గుంతలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు, సిబ్బంది ఫోన్ నంబర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్లను పరిశీలించి, సరఫరాకు అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో జనరేటర్లు, మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, అత్యవసర చికిత్సలకు అవసరమైన మందులు, టీకాలను తగినంతగా నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. డీజిల్, పెట్రోల్‌తో పాటు అత్యవసర వాహనాలకు అవసరమైన ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. తుపాను అనంతరం రహదారులు, విద్యుత్ సరఫరా, కాలువలు, పారిశుధ్య వ్యవస్థలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు విత్తనాల నిల్వలను పరిశీలించి రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై. సత్యనారాయణరావు, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
25న నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈ నెల 25న మాప్–అప్ డేను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన పిల్లలు, కిశోర బాలబాలికలు మాత్రలు తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 25న మాత్రలు తీసుకోలేకపోయిన వారికి అక్టోబర్ 5న మాప్–అప్ డే సందర్భంగా మాత్రలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అచ్యుతకుమారి అధికారులు పాల్గొన్నారు.


