డేటా సెంటర్‌ను వ్యతిరేకిస్తాం | - | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్‌ను వ్యతిరేకిస్తాం

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

● అధికారులకు తూటిపాల రైతుల స్పష్టీకరణ ● సర్వేను అడ్డుకున్న రైతులు ● భూ సేకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌

మాకవరపాలెం : డేటా సెంటర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తామని తూటిపాల రైతులు అధికారులకు స్పష్టం చేశారు. తూటిపాల రెవెన్యూ పరిధిలోని పి.తూటిపాల, అడిగర్లపాలెం, మామిడిపాలెం, పోతలూరు ప్రాంతాల్లో రెన్యూ గ్రీన్‌ ఎనర్జీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే 454 ఎకరాలను రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేసి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ భూముల్లో ఉన్న చెట్లు, కట్టడాలు, బావులు, బోర్ల వివరాల నమోదుకు సోమవారం నుంచి సర్వే చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సర్వేకు వెళ్లిన సిబ్బందిని తూటిపాల రైతులు స్థానిక సచివాలయం వద్ద అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ కాకర నూకరాజు తూటిపాల చేరుకుని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ భూములు ఎందుకు సేకరిస్తున్నారో కనీసం తెలియజేయకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. పరిశ్రమలకే భూములు సేకరిస్తే పరిహారం, ఇతర ప్యాకేజీలపై గ్రామసభ ఏర్పాటు చేసి స్పష్టంగా వివరాలు వెల్లడించాలన్నారు. ఇవేమీ లేకుండా భూముల్లో ఉన్న చెట్లు, తదితర వివరాల నమోదుకు ఎలా సర్వే చేస్తారని నిలదీశారు. భూ సేకరణపై స్పష్టత ఇవ్వాలని, అంత వరకు సర్వేకు చేసేందుకు వీల్లేదని తెగేసి చెప్పారు.

డేటా సెంటర్‌కు మా భూములు ఇవ్వం

అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగే డేటా సెంటర్‌నే ఏర్పాటు చేస్తే తమ శవాలపైనే నిర్మించాలన్నారు. అంత గోప్యంగా భూ సేకరణ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దీంతోపాటు ఏ రైతుకు ఎంత భూమి ఉందో కూడా చెప్పకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనిపై తహసీల్దార్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ సర్వే చేశామన్నారు. ఇక చెట్లు, కట్టడాలు, బోర్లు, బావులకు ఎంత పరిహారం ఇస్తామో తెలియజేసేందుకే ఐదు రోజుల పాటు సర్వే చేస్తున్నామన్నారు. సర్వే అనంతరం పూర్తి వివరాలు ఉన్నతాధికారులు రైతులకు వెల్లడిస్తారని వివరించారు. ఏది ఏమైనా భూ సేకరణపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సర్వే చేయొద్దని రైతులు తెగేసి చెప్పారు. దీంతో డిమాండ్లను లిఖిత పూర్వకంగా అందజేస్తే ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తహసీల్దార్‌ రైతులకు సూచించారు. చేసేదిలేక అధికారులు సర్వే చేయకుండా వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో తూటిపాల రెవెన్యూ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement