అనకాపల్లి: అగనంపూడి నుంచి అనకాపల్లి తాగునీటి సరఫరాను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు తీసుకురావడం జరుగుతుందని, పట్టణ పరిధిలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. స్థానిక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి, అర్జీదారుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టణ పరిధిలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తున్నామన్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు వారంలో రెండురోజులు అనకాపల్లి జోనల్ కార్యాలయానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. జీవీఎంసీ పరిధిలో 525 సచివాలయాలు ఉన్నాయని, వాటి పరిధిలో పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించడం జరిగిందని అన్నారు. 15 ఫైనాన్స్ నిధులతో పలు అభివృద్ధి పనులకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం పట్టణలో ఏఎంసీ కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న రాజీవ్ గృహాలను పరిశీలించి, అక్కడ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందన్నారు.
గవరపాలెం రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గతవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులతో ఫోన్‌లో నేరుగా కమిషనర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషన్ కె.చక్రవర్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


