కసరత్తు ! | - | Sakshi
Sakshi News home page

కసరత్తు !

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

స్థానిక పోరుకు

సాక్షి, అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ఆలస్యం కావడంతో, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 2025 ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో, రెండు మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు ఇంటింటా సర్వే మంగళవారం నుంచి ప్రారంభమైంది. తొలుత మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ఐదు వార్డులు(80 నుంచి 84 వరకూ వార్డులు) మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉండగా, యలమంచిలి, నర్సీపట్నంలో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి/ఏప్రిల్‌ నెలల్లో ముగిసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) మొదటి దశ గత నెలలో పూర్తికాగా, ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తుది ఓటరు జాబితాలను అక్టోబరు 3వ తేదీన విడుదల చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటే తుది జాబితాలు విడుదలైన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో, గత ఏడాది ఓటరు జాబితాల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం వచ్చే నెలలో పూర్తికానుండగా, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల తర్వా త వీటికి ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం.

రిజర్వేషన్లపై కసరత్తు

గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాలను సిద్ధం చేయడం, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ ఇప్పటికే నివేదిక సమర్పించింది. జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 243 (37.62 శాతం) పంచాయతీ సర్పంచు పదవులను బీసీలకు కేటాయించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. సెప్టెంబరు 7న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లతో తుది జాబితాను ప్రచురిస్తారు.

విభజిత జిల్లాల వారీగానే ఎన్నికలు..?

అనకాపల్లి జిల్లా కేంద్రంగా జిల్లా పరిషత్‌ కార్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పాత ఆర్డీవో కార్యాలయంలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రూ.20 లక్షలతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి సమగ్ర సమాచారంతో వార్డుల వారీగా మ్యాపింగ్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. జిల్లాలో అడ్డురోడ్డు, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 24 మండలాలు ఉన్నాయి. 644 పంచాయతీలు, 6,282 వార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్లో ప్రచురితమైన ఓటర్ల జాబితా వివరాలు మేరకు 644 పంచాయతీల్లో 12,35,083 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,02,281, మహిళలు 6,32,785 ఇతరులు 17 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 మంది ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 2021లో 39 జెడ్పీటీసీ స్థానాలు, 651 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 37 జెడ్పీ స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగగా, రెండు ఏకగ్రీవమయ్యాయి. 651 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 612 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి విభజిత జిల్లాల వారీగా ఎన్నికలు జరగనున్నాయి.

ప్రారంభమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వే

ఐదు రోజుల పాటు గ్రామాల్లో సర్వే

సెప్టెంబర్‌ 7న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురణ

ఆగస్టు 31లోగా పోలింగ్‌ కేంద్రాలఎంపిక పూర్తికి ఆదేశాలు

‘సర్‌‘ ప్రక్రియ ఆలస్యం కావడంతోనే ఎన్నికల కమిషన్‌ నిర్ణయం

జిల్లాలో 646 పంచాయతీలు,2 మున్సిపాలిటీలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్వే షెడ్యూల్‌ ఇలా..

ఆగస్టు 18 నుంచి 22 : గ్రామాల్లో అధికారుల ద్వారా ఇంటింటా సర్వే

ఆగస్టు 23, 24 : సర్వే ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వర్గీకరణ

ఆగస్టు 25 : పంచాయతీ నోటీసు బోర్డుల్లో ప్రాథమిక జాబితాల ప్రదర్శన

ఆగస్టు 26 నుంచి 28 : జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ

ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2 : అభ్యంతరాల పరిశీలన, విచారణ

సెప్టెంబరు 3 నుంచి 6 : గ్రామసభల్లో జాబితాల పరిశీలన, ఆమోదం

సెప్టెంబరు 7 : ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురణ

రిజర్వేషన్ల వారీగా సర్వే ప్రారంభమైంది..

నిర్దేశించిన షెడ్యూల్‌ అనుగుణంగానే జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రిజర్వేషన్ల సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత అధికారులు, సిబ్బందికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాం. నిర్ణీత గడువు లోగా సర్వే, ఆయా వర్గాల ఓటర్ల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణ, గ్రామసభల నిర్వహణ తదితర ప్రక్రియలను పూర్తి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్‌ సర్వే ఈ నెల 22వ తేదీలోగా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 7న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఫైనల్‌ జాబితా ప్రచురిస్తాం.

– సందీప్‌, డీపీఓ, అనకాపల్లి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement