తుమ్మపాల : అర్హులైన వారికి పింఛన్లు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సామాజిక పింఛన్ల పంపిణీపై జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతిక సమస్యల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై కారణాలు తెలిసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా సమర్ధంగా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, క్షేత్రస్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న దాదాపు 7వేల నంబర్లకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి, వచ్చే వారం నాటికి పూర్తి స్థాయి జీఎస్ స్టేట్‌మెంట్ సమర్పించాలని ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎంపీడీఓలు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి నెలా లబ్ధిదారులందరికీ క్రమం తప్పకుండా పింఛన్ అందేలా చూడాలి. పింఛన్ల పంపిణీకి ముందు రోజు రాత్రే పీడీవోలతో సమావేశం నిర్వహించి, కేటాయించిన లబ్ధిదారులందరికీ ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించాలని, ఫోన్ నంబర్ల నవీకరణ చేయాలని తెలిపారు. మొత్తం 7,221 మంది పింఛనర్ల ఫోన్ నంబర్లు డేటాబేస్‌లో అప్‌డేట్ కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వి.మాడుగుల (644), నాతవరం (573), చోడవరం (497) మండలాల్లో అధిక సంఖ్యలో పెండింగ్ ఉన్నాయని, ఎంపీడీవోలు తక్షణమే స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని ఫోన్ నంబర్లను తనిఖీ చేసి అప్‌డేట్ చేయాలన్నారు. అవినీతికి తావులేకుండా సచివాలయ స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్


