ఉచిత విద్యుత్‌కు
రైతులపై లక్షల్లో బిల్లుల భారం
కోటా మించితే ప్రతి యూనిట్‌కు రూ.7.75 వసూలు ఏడాదిన్నర బకాయిలను ఒకేసారి చూపుతూ భారీ బిల్లులు ఒక్కో రైతుపై రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా భారం బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు 2024 వరకు సున్నా బిల్లులు.. 2025 నుంచి చార్జీల బాదుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
రైతులకు ఉచితంగా అందుతున్న వ్యవసాయ విద్యుత్‌కు చంద్రబాబు ప్రభుత్వం కోటా కొర్రీలు పెడుతోంది. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద ఏడాదికి 6,000 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా సరఫరా చేస్తామని, అంతకుమించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.7.75 చొప్పున చార్జీలు వసూలు చేస్తామని చెబుతోంది. తాజాగా ఏడాదిన్నర బకాయిలను ఒకేసారి చూపిస్తూ భారీ మొత్తాలతో బిల్లులు జారీ చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.50 వేల నుంచి లక్షకుపైగా బకాయి ఉన్నట్లు చూపిస్తోంది. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసుల్లో హెచ్చరిస్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
2025 నుంచే మారిన లెక్కలు
2024 చివరి వరకు రైతులు ఎంత విద్యుత్ వినియోగించినా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ చార్జీలు విధించలేదు. అయితే 2025 నుంచి కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. తొలుత నేరుగా విద్యుత్ బిల్లులు జారీ చేయకుండా నెలకు రూ.30 చొప్పున కస్టమర్ చార్జీలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని ఆరు నెలలకు ఒకసారి రూ.180 చొప్పున రైతులు చెల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం 6,000 యూనిట్ల పరిమితిని తెరపైకి తీసుకొచ్చి, దానికి మించి వినియోగించిన విద్యుత్‌కు చార్జీలు విధిస్తోంది. ఏడాదికి 6,000 యూనిట్లు అంటే నెలకు సగటున 500 యూనిట్లకు పరిమితి విధించినట్లవుతోంది. అంతకు మించి వినియోగించిన ప్రతి యూనిట్‌కు రూ.7.75 చొప్పున బిల్లు వేస్తోంది. ఫలితంగా ఏడాదిన్నరగా పేరుకుపోయిన మొత్తాన్ని ఇప్పుడు ఒకేసారి రైతులపై మోపుతోంది.
కోటా పేరిట కోతలు
వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని అమలు చేశారు. అనంతరం 2009 ఎన్నికల్లో 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతూ వచ్చింది. రైతులు 9 గంటల పాటు ఎంత విద్యుత్ వినియోగించినా ఉచిత విద్యుత్ పథకం వర్తించేది. ఇప్పుడు మాత్రం వినియోగానికి యూనిట్ల పరిమితి విధించడం ద్వారా పథకానికే కోతలు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 5 హెచ్‌పీ మోటార్లు వినియోగించే రైతులకు ఏడాదికి 6,000 యూనిట్ల పరిమితిని వర్తింపజేస్తూ, అదనపు వినియోగానికి చార్జీలు విధిస్తున్నారు.
యూనిట్‌కు రూ.7.75 చొప్పున వసూలు
రైతులకు 9 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని చెబుతూనే వినియోగించే విద్యుత్‌కు యూనిట్ల పరిమితి విధించడం విరుద్ధంగా ఉందని రైతులు అంటున్నారు. 9 గంటల సరఫరా సమయంలో రైతు తన అవసరానికి అనుగుణంగా మోటారు నడుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏడాదికి 6,000 యూనిట్లకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.7.75 చొప్పున చార్జీ విధిస్తున్నారు. ఇలా అదనపు వినియోగంపై విధిస్తున్న రేటు వాణిజ్య కేటగిరీ తరహాలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కొద్దికాలానికే ఉచిత కోటా పూర్తయిందంటూ చార్జీలు విధించడం వల్ల వ్యవసాయ విద్యుత్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ కట్
తాజాగా జారీ చేస్తున్న బిల్లుల్లో నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని ఈపీడీసీఎల్ హెచ్చరిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి రూ.180 మాత్రమే చెల్లిస్తున్న తమకు ఇప్పుడు రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు బకాయిలు చూపించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌కు యూనిట్ల పరిమితి విధించి, అదనపు వినియోగానికి చార్జీలు వసూలు చేయడంతోపాటు, పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను క్రమంగా కుదించే దిశగా అడుగులు వేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆది నుంచీ వ్యతిరేకతే..!
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో చంద్రబాబు వైఖరిపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. రైతులు విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఉద్యమించిన సమయంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు రైతులు మృతి చెందారు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు దానిపై విమర్శలు చేశారు. వైఎస్ హయాంలో అమలులోకి వచ్చిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం తర్వాతి ప్రభుత్వాల్లోనూ కొనసాగింది. ఇప్పుడు వినియోగ పరిమితి విధించడం, అదనపు వినియోగానికి చార్జీలు వసూలు చేయడం, భారీ బకాయిలను రైతులపై మోపడం వంటి పరిణామాలతో ఉచిత విద్యుత్ పథకంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.


