ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం ఎసరు
సాగుకు ముందే ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపు
వ్యవసాయ రుణాల నగదు నుంచే ప్రీమియం కోత
ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక అనిశ్చితిలో సాగు
రైతులకు గత ప్రభుత్వంలో ఉచిత బీమా
జిల్లాలో 60.52 శాతం వరకు పంటల బీమా నమోదు
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షా 32 వేల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటివరకూ 79,592 ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. 72,575 మంది రైతుల పేరు మీద ఈ బీమా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావంతో 60.52 శాతం వరకూ పంటల బీమా ప్రీమియం పూర్తయింది. రైతులు ఈ ఏడాది పంటల బీమాగా 1 లక్షా 32 వేల ఎకరాలకు రూ.1,10,88,000 చెల్లించనున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ మొత్తం ప్రభుత్వమే భరించింది.
సాక్షి, అనకాపల్లి : ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో వర్షాలు లేకపోవడంతో రైతులు పంట వేయాలో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆందోళనలో ఉన్నారు. నష్టాలు వచ్చి అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో పలు చోట్ల నెలకొన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి విపత్తుల సమయంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు ఉచిత పంట బీమా తీసుకొచ్చింది. విపత్తు ప్రభావంతో ఏ రైతు నష్టపోకుండా ప్రతి రైతునూ ఆదుకునేందుకు అండగా ప్రభుత్వం నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తుంది. వాతావరణ పరిస్థితుల అనుకూలించక నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు సగం పూర్తయినా జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 10 శాతం కూడా వరినాట్లు జరగలేదు. నారు వేసుకుని, వర్షాలు పడితే నాట్లు వేద్దామనే రైతుల ఆశశ..నిరాశగానే ఉంది. ఉచిత బీమా లేకపోయినా రైతులు స్వయంగా బీమా చెల్లించుకుంటున్నారు.
సాగు లేకున్నా ప్రీమియం చెల్లించాల్సిందే..
ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు పడకపోవడంతో వరిసాగు నత్తనడకన సాగుతోంది. రైవాడ, తాండవ రిజర్వాయర్‌ల నుంచి సాగు నీరు విడుదల చేయడతో ఆయా ఆయకట్టు ప్రాంతాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. మిగిలిన చోట్ల వర్షాలు లేక ఇంకా సాగు ప్రారంభం కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వమే ఉచిత పంట బీమా కింద డబ్బులు రైతు తరుపున చెల్లించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రెండేళ్లుగా ఉచిత బీమా పథకానికి ఎసరు పెట్టింది. గత రెండు ఖరీఫ్ సీజన్లలో రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు. అప్పు చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చేశారు. ఈ ఏడాది కరువు పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు అనిశ్చితిలో ఉంది. కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులే బీమా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. అది కూడా సాగు లేకున్నా ప్రీమియం చెల్లించాలంటూ నిబంధన పెట్టారు. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌లో వరి పంట సాగు ఇంకా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో రైతుకు పంటల బీమా అనేది భారంగా మారింది. సాగు చేయకపోయినా ఎకరాకు రూ.84 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం కూడా ఒక్కో జిల్లాలో ఒక్కోలా ఉంది. అనకాపల్లి జిల్లాకు పొరుగు జిల్లాలైన విశాఖలో ఎకరాకు రూ.420, కాకినాడ జిల్లాలో రూ.720 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది.
సాగుపై అనిశ్చితి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. జూలై, ఆగస్టు నెలలో దాదాపు 69 శాతం వర్షపాత లోటు నమోదైంది. రాబోయే నెలల్లో కూడా 35 నుంచి 40 శాతం వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం వాతావరణ మార్పులతో వర్షం పడితే ఒకటే కుండ పోత..లేదంటే ఉక్కపోత అన్నట్టుగా పరిస్థితి ఉంది. అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కేవలం 2, 3 రోజుల్లోనే విపరీతంగా వానలు పడి ఆ తరవాత మళ్లీ సాధారణమైపోవడం జరుగుతోంది. ఇప్పుడు ఆగస్టు వచ్చింది. వర్షాలు పడే కాలం. కానీ ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు లేవు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ వరకూ వర్షాభావ పరిస్థితులే ఉండనున్నాయి. ఇలాంటి సమయంలో సాగుకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా సాగునీరు విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్‌కు సరైన విధంగా సన్నద్ధం కాకపోతే రైతులకు ఆర్థిక సవాళ్లతో పాటు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అస్కారం ఉంది.
31వ తేదీ వరకూ గడువు పొడిగింపు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) కింద దిగుబడి ఆధారిత పంటల ప్రీమియం చెల్లింపు గడువును మరోసారి బీమా కంపెనీలు పొడిగించాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 31 వరకూ ప్రీమియం చెల్లింపునకు వెసులుబాటు కల్పించాయి. అనకాపల్లి జిల్లాలో ఈ నెలాఖరి వరకూ వెసులుబాటు ఉంది.
బీమాతో సాగుకు రక్షణ
ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు పడకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. రిజర్వాయర్లలో సాగు నీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే తాండవ, రైవాడ రిజర్వాయర్ల ద్వారా సాగునీరు విడుదల చేశారు. వాటి ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ సాగు జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాగు వేయకపోయినా బీమా చెల్లించుకోవచ్చు. గతేడాదితో పోల్చితే భారీగా ఇప్పటి వరకూ బీమా 60.52 శాతం చెల్లించారు. ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది. వరిసాగు చేసే ప్రతి రైతు బీమా చెల్లించాలి. బీమా చెల్లించడం కారణంగా మీకు పంట నష్టం కలిగితే బీమా కంపెనీలే పరిహారం చెల్లిస్తాయి. ఇప్పటివరకూ బీమా చెల్లించని రైతులు ఈ నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాలి.
– ఆశాదేవి, జిల్లా వ్యవసాయాధికారి, అనకాపల్లి
జిల్లాలో అత్యధికంగా నాతవరం మండలంలో బీమా లక్ష్యం 14,996 ఎకరాలు కాగా, తరువాత మాడుగుల మండలంలో 10,338 ఎకరాలు, ఎస్.రాయవరం మండలంలో 8,357 ఎకరాలు, దేవరాపల్లి మండలంలో 8273 ఎకరాలు పెట్టుకున్నారు. అత్యల్పంగా పరవాడ మండలంలో 336 ఎకరాలు, అచ్యుతాపురం 1764 ఎకరాలు, కశింకోట 2,530 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.


