క్షేత్రస్థాయిలో అర్జీలపై పరిశీలన జరపండి | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో అర్జీలపై పరిశీలన జరపండి

Aug 18 2026 12:27 AM | Updated on Aug 18 2026 12:27 AM

● అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు ● కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు 301 వినతులు

తుమ్మపాల : పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీలపై అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.సందీప్‌ అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 301 వినతులు నమోదు కాగా రెవిన్యూ క్లినిక్‌– 143, పీజీఆర్‌ఎస్‌–158 ఉన్నాయి.

బీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు

అంగన్‌వాడీ, ఏఎస్‌ఐఐఏ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్‌ఐఐఎం, ఇతర పథకాల కార్యకర్తల వేతనం పెంపు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల తక్షణ పరిష్కారం కోరుతూ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఆయా పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం రూ.30 వేలు అందించాలని, కనీస పింఛను నెలకు రూ.21 వేలు నుంచి రూ.27,500 పెంచడం, వీడీఏ, ఆయుష్మాన్‌ భారత్‌ యోజనతో అనుసంధానం చేయడం ఈపీసీ–95 కింద కనీస పింఛనును నెలకు రూ.21000 నుంచి 27,500కు పెంచాలని అన్నారు. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐసి బోనస్‌ లెక్కింపుల కింద కవరేజ్‌ గరిష్ట పరిమితులను రెట్టింపు చేయడం, పాత పింఛను పథకం పునరుద్ధరణ, గ్రాట్యూటీ లెక్కింపును 15 రోజుల వేతనం నుంచి 30 రోజుల వేతనానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా సవరించాలన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులతో సహా ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాల పెంపు, అన్ని రకాల పథకాల కార్యకర్తలకు (ఆంగన్‌వాడీ, ఏఎస్‌ఐఐఏ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్‌ఐఐఎం ఇతర పథకాల కార్యకర్తలు గౌరవ వేతనం పెంచాలని, బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడం, కార్మిక చట్టాలలోని కార్మిక వ్యతిరేక నిబంధనలను తొలగించేలా సవరించాలన్నారు. ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ భద్రత, తొలగింపు, సింహాద్రి ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్‌ కార్మికుల పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.

నీటి వనరులను కాపాడాలి

కాగిత గ్రామంలో గెడ్డ భూములు చెరువులకు వర్షపునీరు అందించే ఇతర కాలువలను ప్రైవేట్‌, ప్రభుత్వ అవసరాలకు బదిలీచేసే ప్రతిపాదనను తక్షణమే రద్దుచేయాలని, నీటివనరులను కాపాడాలంటూ గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేశారు. నక్కపల్లి మండలం కాగిత గ్రామ సర్వే నంబర్‌.128, 195, 164, 176, 177, 162 (గ్రామకంఠం), 187 గెడ్డలుగా స్పష్టమైన రెవెన్యూ రికార్డులు ఉంటూ గ్రామ పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ప్రధాన నీటివనరుగా ఉన్నాయి. వర్షపు నీరు ప్రవహించడానికి భూగర్భజలాలు రీచార్జ్‌ అవ్వడానికి ఎంతో కీలకంగా ఉన్నాయి. భూములను రైల్వే స్లైడింగ్‌ ప్రాజెక్ట్‌ (ఎఎంఎన్‌ఎస్‌) కోసం కేటాయించి నిర్మాణాలు చేపడితే నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల చుట్టుపక్కల వందలాది ఎకరాల పంట భూములు ఎండిపోవడమే కాకుండా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి రైతులు రైతు కూలీలు వారి జీవనోపాధి కోల్పోతారని, రైతులు, పశుపోషకులు సాధారణ ప్రజలు కూడా నీటి వనరులను పారిశ్రామిక అవసరాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామసభ ఆమోదం లేకుండా సహజ వనరులను బదిలీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో వినతి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement