నాగోలు: పోలీసుల కళ్లుగప్పి.. హష్ ఆయిల్(గంజాయి నుంచి తయారు చేసిన డ్రగ్) ప్యాకెట్లను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాకుచెందిన ఆరుగురిని ఎస్‌వోటీ ఎల్‌బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. సుమారు రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్‌బీ నగర్‌లోని సీపీ క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హష్ ఆయిల్ సేకరించి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట వద్ద మాటువేసి నిందితులను అడ్డుకున్నామని సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం గెమ్మెల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియాతో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను, నిబియా, చిక్కుడు శరణ్, పంగి జగదీష్‌తో పాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు.
కాళ్లకు..కడుపునకు కిలో చొప్పున
పోలీసుల కళ్లు గప్పేందుకు క్యారియర్లు వినూత్న పద్ధతిని అనుసరించారు. రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపునకు మరో కిలో..చొప్పున ఒక్కొక్కరూ 3 కిలోల హష్ ఆయిల్ ప్యాకెట్లను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకున్నారు. నలుగురు కలిపి 12 కిలోలు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా హష్ ఆయిల్ బెంగళూరుకు తరలించేందుకు వీరు అక్కడి రిసీవర్ సిజోతో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరు నుంచి దందా నడిపిస్తున్నట్టు సీపీ తెలిపారు. గెమ్మెలి శ్రీనుపై గతంలోనే నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, జైలుకు వెళ్లాడని సీపీ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ డ్రగ్స్ రవాణా ప్రారంభించినట్లు వెల్లడించారు. హష్ ఆయిల్ సరఫరా చేసిన కృష్ణ, బెంగళూరులోని ప్రధాన రిసీవర్ సిజో ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ, ఎస్‌ఓటీ డీసీపీ మనోహర్, ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ డీసీపీ షాకీర్ హుస్సేన్, వనస్ధలిపురం ఏసీపీ కాశిరెడ్డి, సీఐ రవిబాబు, ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


