మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 41 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా లో–వోల్టేజ్, విద్యుత్ బిల్లులు, లైన్ షిఫ్టింగ్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, రూఫ్‌టాప్ సోలార్, కొత్త విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వితేజ్ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం, 9493681912 వాట్సాప్ నంబర్‌కు చాట్ చేయడం ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సంస్థ సూచించింది. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీ సూర్యప్రకాష్, సీజీఎం పి.సోల్మన్‌రాజు, జనరల్ మేనేజర్లు ఎం.ఝాన్సీ, వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్, వి.వి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


