సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, చిత్రంలో పలు శాఖల అధికారులు
మహారాణిపేట: విశాఖలో సెప్టెంబర్ 3 నుంచి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే ర్యాలీలో రాత పరీక్షలో అర్హత సాధించిన 10,355 మంది అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు. ఆర్కే బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వరకు 1.6 కిలోమీటర్ల నైట్ రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు తాగునీరు, వైద్య సేవలు, రవాణా, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, ఐటీ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కల్నల్ అమరేష్ సింగ్, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.


