నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ రాజారావుకు వచ్చిన ముందుస్తు సమాచారం మేరకు సిబ్బందితో గబ్బాడ పంచాయతీ శివారు రిట్టవానిపాలెం వద్ద మాటువేశారు. ఇద్దరు వ్యక్తులు కాలేజీ బ్యాగ్‌తో బైక్‌పై వస్తూ, పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని, 7.48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా గోకవరం మండలం గంగంపాలెంకు చెందిన నక్కరాజు లోవరాజు(30), అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల సూర్యప్రకాష్(24)ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


