గ్రామ స్వరాజ్యం
కేరాఫ్
సాక్షి, అనకాపల్లి: గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పల్లె పాలనలో మార్పులకు నాంది పలికింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలోనే అందించాలనే లక్ష్యంతో 2019లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గతంలో ప్రభుత్వ సేవల కోసం మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త వ్యవస్థతో అనేక సేవలు గ్రామంలోనే అందుబాటులోకి వచ్చాయి. జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పింఛను, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఇంటి స్థలం, భూ రికార్డులు, విద్యుత్, తాగునీటి కనెక్షన్లు తదితర సేవలను సచివాలయాల ద్వారా నిర్ణీత గడువులో అందించే విధానం ఏర్పడింది.
గ్రామంలోనే ప్రభుత్వ సేవలు
రేషన్, ధ్రువీకరణపత్రాలు, సంక్షేమ పథకాలు తదితర సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలోనే వివిధ శాఖ ల సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో సచివాలయాలు కీలకంగా మారాయి. ప్రజలు తమ సమస్యలు, అవసరాల కోసం నేరుగా సచివాలయాన్ని సంప్రదించే అవకాశం ఏర్పడింది. దీనివల్ల గ్రామ స్థాయిలో పాలనకు ఒక కొత్త నిర్మాణం ఏర్పడింది.
రైతు ముంగిట సేవలు
రైతులకు సేవలను చేరువ చేసేందుకు రైతు భరోసా కేంద్రాలను (ఆర్‌బీకేలు) సచివాలయ వ్యవస్థతో అనుసంధానించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ సేవ లు ఒకేచోట అందించే విధానం అమల్లోకి వ చ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవ సా య సేవల పంపిణీకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది.
గాంధీ గ్రామ స్వరాజ్య
ఆలోచనకు అనుసంధానం
స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడం, ప్రజలకు పాలనను చేరువ చేయడం వంటి అంశాలను గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్య భావనతో అనుసంధానించి అప్పటి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా స్థానిక పాలనను బలోపేతం చేయాలనే చర్చలో ఆంధ్రప్రదేశ్ మోడల్ కూడా ప్రస్తావనకు వచ్చింది.
పేర్లు మారినా.. వ్యవస్థపై చర్చ
ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలో సేవలు, నిర్మాణంలో ప్రభుత్వం తీసుకుంటున్న మార్పులతో గ్రామీణ పాలనపై మరోసారి చర్చ మొదలైంది. సచివాలయాలకు కొత్త పేర్లు, సేవల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ విమర్శలు, సమర్థనలు కొనసాగుతున్నాయి. అయితే పేర్లు, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి ముంగిటకు ఎంత వరకు చేరాయి? గ్రామ స్థాయిలో పాలన ఎంత సులభమైంది? అన్నదే ఈ వ్యవస్థ విజయాన్ని కొలిచే అసలు ప్రమాణంగా నిలుస్తోంది.
జిల్లాలో వివరాలు ఇలా...
గ్రామ/వార్డు సచివాలయాలు :
522 (465 గ్రామీణ, 57 వార్డు)
సచివాలయ ఉద్యోగులు : 3,824 (ప్రస్తుతం)
రైతు సేవా కేంద్రాలు : 450
వెల్ నెస్ సెంటర్లు: 172


