ఆదివాసీలపై తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి
బిహార్ ఎంపీ రాజారాం సింగ్
అనకాపల్లి: ఆదివాసీలపై పెట్టిన తప్పుడు క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని బిహార్‌లోని కరాకర్ పార్లమెంట్ సభ్యుడు(లోక్‌సభ) రాజా రామ్‌సింగ్ అన్నారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల సభలో ఆయన మాట్లాడారు. తప్పుడు క్రిమినల్ కేసులపై పార్లమెంట్‌లో చర్చించనున్నట్టు తెలిపారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి, బాధితులకు తక్షణ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. మానవ హక్కుల వేదిక జిల్లా నాయకుడు వి.ఎస్. కృష్ణ్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పేద ఆదివాసీల కోసం కాకుండా, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు చటర్జీపురం కేసు స్పష్టం చేస్తోందన్నారు. చటర్జీపురాన్ని స్వయంగా సందర్శించి, వాస్తవాలను తెలుసుకున్నట్టు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం వాస్తవాలు తెలిసినప్పటికీ ఇటువంటి కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. భారత ప్రభుత్వ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఇ.ఏ.ఎస్. శర్మ పంపిన సంఘీభావ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త పి.ఎస్.అజయ్‌కుమార్‌పై కావాలనే పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయడం పేద ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగత బనగరరావు మాట్లాడుతూ ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులు వెనక్కి తీసుకునే వరకూ తమ పార్టీ ఆదివాసీలకు అండగా నిలబడుతుందన్నారు. తప్పుడు కేసుల ద్వారా జరుగుతున్న నిరంతర వేధింపులు గ్రామాల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, ఇది ఆదివాసీల జీవనోపాధిని, గౌరవాన్ని, పాలనపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఐ.ఆర్.గంగాధర్, ఆల్ ఇండియా కిసాన్ మహా సభ ప్రతినిధి హరనాథ్, ఆదివాసీ సంఘం జిల్లా నాయకురాలు కేదారి దేవి, సీపీఐ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


